Saturday, November 23, 2024

మునిసిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.. జూన్‌ 2 తరువాత మెరుపు సమ్మె..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రవ్యాప్తంగా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న మునిసిపల్‌ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఏపీ మునిసిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 45 వేల మంది కార్మికులు విలవిల్లాడుతున్నారని గత ఐదు నెలలుగా హెల్త్‌ అలవెన్స్‌లకు నోచుకోలేక అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు పీఎఫ్‌, ఈఎస్‌ఐ వర్తించక ఇబ్బందులు పడుతున్నారని యూనియన్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఆశ్రుల రంగనాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పటి వరకు సుమారు 200 మంది మృతిచెందారని వందలాది మంది పదవీ విరమణ చేసినా వారి కుటుంబాలకు బెనిఫిట్స్‌ అందలేదన్నారు.

కార్మికుల వారసులకు ఉపాధి కల్పించాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని కూడా ప్రభుత్వం అమలు చేయటంలేదని ఆరోపించారు. నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభాతో పాటు చెత్త, వ్యర్థాలు పెరుగుతున్నాయని అందుకు తగిన సిబ్బందిని నియమించలేదన్నారు. దీంతో రోజువారీ చెత్తసేకరణకు అవసరమైన వాహనాలు సమయానికి చేరుకోక కార్మికులు అవస్థలు పడుతున్నారని వివరించారు. ప్రజలు సైతం యూజర్‌ చార్జీలను వ్యతిరేకిస్తున్నారని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement