అమరావతి, ఆంధ్రప్రభ:పురపాలక విద్యాశాఖను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మరోవైపు పర్యవేక్షణ మాత్రమే చేయాలని, విలీనం వద్దని మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఈ అంశంపై ఆ శాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ నిర్వహించిన సమావేశంలో పర్యవేక్షణ బాధ్యతలు మాత్రమే విద్యాశాఖకు అప్పగిస్తామని, పాఠశాలలు, వాటి ఆస్తులు పురపాలక శాఖలోనే కొనసాగు తాయని స్పష్టం చేసినప్పటికీ.. విలీన ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 59 అర్బన్ లోకల్ బాడీలలో పురపాలక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.
ఆ సమావేశాల్లో పురపాలక స్కూళ్లను పాఠశాల విద్యలోకి విలీనం చేసే ప్రతిపాదనలు ప్రవేశపెట్టి ఆమోదం తెలపబోతున్నారని, దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పురపాలక పాఠశాలల పరిరక్షణ సమితి(జేఏసీ)గా ఏర్పాటైన ఆయా మున్సిపల్ ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే జేఏసీ, ఫ్యాఎ్టో ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. ఇదిలా ఉంటే జిల్లా పరిషత్ పాఠశాలల ఉపాధ్యాయులను విద్యాశాఖలో కలిపినప్పటికీ ఆస్తులను విలీనం చేసుకోలేదని, మున్సిపల్ శాఖకు సంబంధించి మాత్రం ఎలా చేస్తారని ప్రశ్నలు వస్తున్నాయి. పురపాలక స్కూళ్లకు రూ. వేల కోట్ల విలువైన ఆస్తులు అర్బన్ ప్రాం తాల్లో ఉన్నాయని, వాటిని పరిరక్షించేలా ప్రభుత్వం వ్యవహరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..