Tuesday, November 26, 2024

Big Story | మహానగరాల తరహాలో మల్టీఫ్లెక్స్​ భవనాలు.. ప్రయోగాత్మకంగా తిరుపతిలో స్మార్ట్‌ సిటీ

అమరావతి, ఆంధ్రప్రభ: నగరాల్లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని వాహనాల రద్దీని నియంత్రించడంతో పాటు ఆర్థికాభివృద్ధి సాధన దిశగా నగరపాలక సంస్థలను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధానంగా ట్రాఫిక్‌ నియంత్రణకు మహా నగరాల తరహాలో మల్టి స్టోరీడ్‌ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోం ది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతున్న తిరుపతి స్మార్ట్‌ సిటీలో ముందుగా ప్రయోగాత్మకంగా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. తిరుపతి రైల్వే స్టేషన్‌ విష్ణునివాసం సమీపంలో బహుళ అంతస్తుల భవనంలో వాహనాల పార్కింగ్‌కు అనువుగా నిర్మాణాలు చేపట్టనుంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో సహా మొత్తం భవనంలో 400కు పైగా కార్లతో పాటు టూ వీలర్ల పార్కింగ్‌కు అవకాశం ఉండేలా తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ డిజైన్లకు రూపకల్పన చేసింది.

భవనంలోనే మల్టీఫ్లెక్స్ థియేటర్‌తో పాటు ఫుడ్‌ కోర్టు నిర్మాణంతో ఆదాయంతో పాటు ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించినట్లవుతుందని పురపాలకశాఖ భావిస్తోంది.. తిరుపతిలో విజయవంతంగా పూర్తయితే విశాఖపట్నం, విజయవాడలో కూడా ఇలాంటి బహుళ అంతస్తుల పార్కింగ్‌ భవనాల నిర్మాణం జరపాలని యోచిస్తోంది. తిరుపతిలో ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం తరలివచ్చే లక్షలాది మంది భక్తులతో పాటు వాహనాల పార్కింగ్‌ అతిపెద్ద సమస్యగా మారింది. ఈ కారణంగా ముందుగా తిరుపతిని పైలెట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. మల్టిలెవల్‌ కార్‌ పార్కింగ్‌ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌ను విష్ణునివాసం ప్రాంతంలో మునిసిపల్‌ కార్పొరేషన్‌కు ఉన్న 3494 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తిరుపతి నగర నడిబొడ్డున ఉన్న ఈ ప్రాంతంలో పార్కింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మిస్తే ఒకింత వెసులుబాటు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

- Advertisement -

మొత్తం 1,63,515 చదరపు అడుగుల్లో సెల్లార్‌తో పాటు 7 అప్పర్‌ ఫ్లోర్లను నిర్మిస్తారు. 35.5 మీటర్ల ఎత్తుతో మల్టి ప్లక్‌ థియేట ర్‌ మూడు స్క్రీన్లతో ఏర్పాటు కానున్నాయి. భవనానికి 19 శాతం ల్యాండ్‌ స్కేప్‌, 34 శాతం డ్రైవ్‌ వేస్‌, 47 శాతం బిల్డింగ్‌ ఫుట్‌ ప్రింట్‌లకు నిర్దేశించారు. 20 శాతం కామన్‌ ఏరియాతో పాటు 27 శాతం స్టెయిర్‌ కేస్‌, మరో 53 శాతం రెంటల్‌ స్పేస్‌కు డిజైన్లు రూపొందించారు. బేస్‌మెంట్‌ ఏరియాలో 118 కార్లు, 4,5 ఫ్లోర్లలో 51 చొప్పున, సెవెంత్‌ ఫ్లోర్‌లో 102 కార్ల పార్కింగ్‌ సౌలభ్యం కల్పిస్తారు. 550 సీటింగ్‌ సామర్థ్యంతో మల్టి ప్లక్స్‌ థియేటర్లు ఏర్పాటవుతాయి. పురపాలకశాఖ ప్రజారోగ్య విభాగం ఈఎన్‌సీ రూ. 50 కోట్లకు సాంకేతిక అనుమతులు మంజూరు చేశారు. కాగా 38, 98,25,801 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు బిడ్‌లను ఆహ్వానించారు.

ఈరోడ్‌కు చెందిన ఆర్‌ఆర్‌ తులసీ బిల్డర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ 40,89,27,265 కోట్లకు టెండర్లను దక్కించుకుంది. తిరుపతి స్మార్ట్‌ సిటీ అభివృద్ధికి సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆదేశాల మేరకు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్‌ హరిత నేతృత్వంలో త్వరితగతిన ప్రాజెక్టు పనులు పూర్తిచేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. స్మార్ట్‌ సిటీలో భాగంగా తిరుపతికి ఇప్పటికే అనేక ప్రాజెక్టులు వచ్చాయి. శ్రీనివాస సేతు, సోలార్‌ ప్రాజెక్టు, సాలిడ్‌ వేస్ట్‌ మేనేజిమెంట్‌, ఉద్యానవనాల అభివృద్ధి, వినాయకసాగర్‌ ప్రాజెక్టు, అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం తదితర నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.

కార్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌లో డ్రెయినేజీ, సీవేజీ, వర్షపునీటి నిర్వహణ, అగ్నిమాపక సదుపాయాలతో పాటు తగిన వెంటిలేషన్‌తో నిర్మించేందుకు డిజైన్లు రూపొందించారు. వాహనాల రాకపోకలకు అనువుగా పాదచారులకు మరోవైపున స్థల కేటాయింపుు చేశారు. రెవెన్యూ జనరేటెడ్‌ ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న ఈ బహుళ అంతస్తుల భవన పార్కింగ్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా నగరపాలక సంస్థల్లో చేపట్టే అభివృద్ధి పనులకే వినియోగించనున్నట్లు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి తెలిపారు

Advertisement

తాజా వార్తలు

Advertisement