రాజమండ్రి – స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్నారు. గత 21 రోజులుగా ఆయన జైల్లోనే గడుపుతున్నారు. మరోవైపు చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, మాజీమంత్రి నారాయణలు నేడు ములాఖత్ ద్వారా ఆయనను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, జైల్లో అందుతున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లినప్పటి నుంచి భువనేశ్వరీ, బ్రహ్మణిలు రాజమండ్రిలోనే ఉంటున్నారు. ఆయన కోసం జైలుకు అల్పాహారం, భోజనం పంపిస్తున్నారు. మరోవైపు తమను కలిసేందుకు వస్తున్న టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. చంద్రబాబుకు సంఘీభావంగా టీడీపీ శ్రేణులు కొనసాగిస్తున్న రిలే నిరాహారదీక్షలకు వెళ్లి వారితో మమేకమవుతున్నారు.
ఇది ఇలా ఉంటే , చంద్రబాబుని కలిసిన అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడుతూ, తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు కుట్రపూరితమని.. ఈ విషయం అందరికీ తెలుసని అన్నారు. ‘‘కచ్చితంగా మాకు న్యాయస్థానంలో న్యాయం జరుగుతుంది. 2001లో కొనుగోలు చేసిన రూ. 7కోట్లు విలువైన నా సొంత భూమి కూడా రింగ్‌రోడ్‌లో పోయింది. నా భూమే పోగొట్టుకున్నా.. నేను అవినీతి చేస్తానా? త్వరలోనే జనసేనతో కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తాం’’ అని నారాయణ తెలిపారు.