Saturday, November 23, 2024

AP | గుంటుపల్లిలో జాతీయ రహదారిపై ఎంపీపీ బైఠాయింపు.. భారీగా స్తంభించిన ట్రాఫిక్

ఇబ్రహీంపట్నం (ప్రభ న్యూస్) : గుంటుపల్లి ఇసుక రీచ్ లో మంగళవారం ఉదయం ప్రారంభమైన ఇసుక దుమారం రాత్రి జాతీయ రహదారిపై రాస్తారోకోకు దారితీసింది. రీచ్ నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న దుర్గా ప్రసాద్ లారీలను నిలిపివేశారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, పోలీసులు రీచ్ వద్దకు చేరుకుని లారీలను స్టేషన్ కు తరలించారు. అయితే, ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై రాత్రి వరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఎంపీపీ కార్యకర్తలతో కలిసి గుంటుపల్లి రైల్వే రోడ్డు సెంటర్ లో జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.

సమాచారం అందుకున్న పోలీసులు రంగం ప్రవేశం చేసి రహదారిపై బైఠాయించిన ఎంపీపీకి సర్ది చెప్పి ఆందోళన విరమించాలని కోరారు. దీంతో పాలడుగు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమాలపై స్పందించాల్సిన అధికారులు మిన్నకుండి అధికార పార్టీ నాయకులనే కట్టడి చేస్తున్నారని ఎంపీపీ జ్యోత్స్న ఆరోపించారు. జాతీయ రహదారిపై రాస్తారోకోతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎట్టకేలకు ఆందోళన చేస్తున్న వారిని సీఐ పి.శ్రీను, ఎస్సైలు పాపారావు, మణి, సిబ్బంది పక్కకు పంపి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement