Sunday, September 8, 2024

MPDO – ఆయనది ఆత్మహత్యే …. బర్త్ డే రోజునే బలవన్మరణం

తూడులో చిక్కుకున్న బాడీ
ఎట్టకేలకు ఏలూరు కాలువలో లభ్యం
వీడిన తొమ్మిది రోజుల మిస్టరీ
ఫెర్రీ వివాదమే అసలు కారణం
మాజీ చీఫ్ విప్ వేధింపులపై ఆరోపణ
ఇక కేసు దర్యాప్తు చక చక

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ (మధురానగర్) గత తొమ్మిది రోజులుగా.. నరసాపురం ఎంపీడీవో వెంకటరమణారావు.. మిస్సింగ్ మిస్టరీ కథ విషాదాంతమైంది. ఏలూరు కాలువలో మంగళవాకం ఆయన మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. గత తొమ్మిది రోజులుగా ఆయన మిస్టరీపై పోలీసు యంత్రాంగం మొత్తం దృష్టి కేంద్రీకరించింది. సెల్ లోకేషన్ తో ఆయన అదృశ్యమైన ప్రాంతంలో ఎన్డీఆర్ ఎఫ్ దళంతో జల్లెడ పట్టారు. చివరికి సోమవారం ఏలూరు కాలువలో నీటి ప్రవాహాన్ని నిలిపివేశారు. గత ఎనిమిది రోజులుగా రమణారావు మృతి చెందాడా? బతికి ఉన్నాడా? అనే మీమాంశలో పోలీసులు జట్టుపీక్కున్నారు. ఎట్టకేలకు కాలువలో నీటిని అదుపు చేసి రమణారావు మృతదేహాన్ని గుర్తించారు. సీఐ రామారావు నేతృత్వంలో పోలీసులు రమణారావు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

బర్తడే రోజునే సూసైడ్

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీడీవోగా పనిచేస్తున్న మండవ వెంకట రమణరావు.. విజయవాడ సమీపంలోని కానూరు మహాదేవపురం కాలనీలో నివాసం ఉంటున్నాడు. జులై 3వ తేదీ నుంచి సెలవు పెట్టారు. ఇటీవల కానూరులోని ఇంటికి వచ్చారు. 15వ తేదీన మచిలీపట్నంలో పని ఉందని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. రాత్రి 10 గంటలకు ఫోన్‌ చేసి తాను మచిలీపట్నంలో ఉన్నానని.. ఇంటికి రావడానికి ఆలస్యమవుతుందని చెప్పారు. నా పుట్టిన రోజైన 16వ తేదీనే నా చావు రోజు కూడా.. అందరూ జాగ్రత్త అని అర్ధరాత్రి దాటాక కుమారుడికి ఒక మెసేజ్‌ చేశాడు. అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు రాసిన సూసైడ్‌ నోట్‌ను కూడా తన సెల్‌ఫోన్‌ నుంచి ఫ్యామిలీ మెంబర్స్‌కు పంపించారు. అందులో వైసీపీ ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్ ప్రసాదరాజుపై తీవ్ర ఆరోపణలు చేశారు. నరసాపురంలో ఫెర్రీ లీజుకు సంబంధించి ప్రసాదరాజు అండదండలతో కాంట్రాక్టర్‌ రెడ్డప్ప బెదిరింపులు తాళలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని అందులో పేర్కొన్నారు. ఇది చూసి ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గాలింపు ఇలా..

తండ్రి రమణరావు మెసేజీతో భయపడిన చిన్న కుమారుడు తెల్లవారుజామున03:00 గంటలకు పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వెంటనే పెనమలూరు పోలీస్ లు స్పందించి ఆ తెల్లవారుజామునే ఒక బృందాన్ని మచిలీపట్నం రైల్వే స్టేషన్ కి పంపించారు. రైల్వే స్టేషన్ కి వెళ్లిన బృందానికి అక్కడ 15 వ తారీకు మధ్యాహ్నం 02:30 నిమిషాల సమయంలో విజయవాడ కు టికెట్ తీసుకున్న రమణ రావును సీసీ కెమెరా లో గుర్తించారు. .సీసీ కెమెరాల ఆధారంతో ప్రతి రైల్వే స్టేషన్ లో క్షుణ్ణంగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు._ ఒకవైపు సీసీ కెమెరాలను ఒక బృందం పరిశీలిస్తుండగా మరొక బృందం ఆయన కాల్ డీటెయిల్స్ ను, గూగుల్ మ్యాపింగ్ ను అనుసరించారు. ఆయన మధురానగర్ స్టేషన్ లో దిగి అదే ప్రదేశంలో సంచరించినట్లు గుర్తించారు. తదుపరి ఆయన రెండవ ఫోన్ 16 న అర్ధరాత్రి చివరి ఆక్టివిటీని ఏలూరు కాలువ దగ్గర గుర్తించారు. వ్యక్తిగత కారణాలు దృష్ట్యా ఆత్మహత్య చేసుకున్నారనే అనుమానంతో ఏలూరు కాలువ చుట్టు పక్కల ప్రాంతాలను ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఏలూరు కాల్వ నుంచి పెనమలూరు సీఐ బృందం, హనుమాన్ జంక్షన్ సీఐ బృందం ఏలూరు కాల్వ ప్రవాహం వైపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో గాలించారు. కానీ జాడ రాలేదు.

తెరమీదకు మాజీ ఛీప్ విప్ వేధింపులు

మూడున్నరేళ్లుగా నరసాపురం ఫెర్రీకి చెందిన బోట్లకు రూ.55 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాలి. అప్పటి చీఫ్ విప్ ప్రసాదరాజు అండదండలతో ఆ కాంట్రాక్టరు సొమ్ము చెల్లించటం లేదు. పైగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. మరో వైపు ప్రసాదరాజు ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నానని, దీన్నుంచి బయటపడే మార్గం కనిపించడంలేదని ఎంపీడీవో రమణారావు తన లేఖలో పేర్కొన్నారు. 33 ఏళ్లు నిజాయితీగా పనిచేసిన తాను ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకోవాల్సి వస్తుందని అనుకోలేదని సూసైడ్ నోట్‌లో వెంకటరమణ ఆవేదన వ్యతక్తం చేశారు.

ఆధారాల సేకరణలో బిజీబిజీ

సీసీఎస్ డీఎస్పీ ఆధ్వర్యంలో హనుమాన్ జంక్షన్, గన్నవరం, పెనమలూరు సీఐలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి ఏలూరు కాలువ చుట్టుపక్కల ప్రవాహ పరిసర ప్రాంతాలు జల్లెడ పట్టారు. ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్ఐ ల ఆధ్వర్యంలో టెక్నికల్ అనాలిసిస్ కోసం ఒక బృందం, సీసీ ఫుటేజెస్ పరిశీలనకు కంకిపాడు సీఐ, గుణదల సీఐ ఆధ్వర్యంలో ఒక బృందం, రమణారావు బ్యాంకు ఖాతా లావాదేవీలు పరిశీలనకు ఇద్దరు ఎస్సై లతో కలిపి ఒక బృందం పని చేసింది. ఇక పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో ఆయన పని చేసిన ప్రదేశం, ఆయన నివసిస్తున్న ప్రదేశాలలో రెండు బృందాలు గాలింపు చర్యలు తీవ్రతరం చేశారు. ఈ మొత్తం దర్యాప్తును పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి సహకారంతో ఏలూరు రేంజ్ ఐజి జీవీజీ అశోక్ కుమార్ పర్యవేక్షించారు. ఎట్టకేలకు రమణారావు ఆత్మహత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. కృష్ణాజిల్లా ఎస్పీ గంగాధర్ రావు మంగళవారం మధ్యాహ్నం మచిలీపట్నంలో విలేఖరుల సమాచారం ఏర్పాటు చేసి.. రమణారావు ఆత్మహత్యను ద్రువీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement