Friday, November 22, 2024

జగన్ మినహా అన్ని రాష్ట్రాల సీఎంలకు ఎంపీ రఘురామ లేఖ!

నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్‌ణంరాజు బెయిల్ పై బటయకు వచ్చినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వంపై తనదైన శైలిలో పోరాటాన్ని సాగిస్తున్నారు. తనతో ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. తన అరెస్ట్‌, తదనంతర పరిణామాలను వివరిస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీ ఎంపీలకు లేఖ రాసిన రఘురామ… తాజాగా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖ రాశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మినహా.. అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖలు రాయడం గమనార్హం. పోలీసులు తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు.

మే 14వ తేదీన ఏపీ సీఐడీ పోలీసులు తనను క్రూరంగా హింసించారని.. తొలిసారి సెక్షన్ 124 ఏ కింద ఒక ఎంపీని అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని లేఖలో రఘురామ పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేసినందుకే.. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్‌ చేయించారని రఘురామ కృష్ణరాజు తెలిపారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో తనకు మద్దతిచ్చేలా వారి ఎంపీలకు సూచించాలని ఆయా ముఖ్యమంత్రులను ఎంపీ రఘురామ కోరారు. తనపై రాజద్రోహం సెక్షన్‌ను తొలగించేలా అసెంబ్లీల్లో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని సీఎంలకు రాసిన లేఖలో రఘురామ కోరారు. కాగా, రఘురామ లేఖ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement