నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి గుంటూరు సీఐడీ కార్యాలయంలో అర్ధరాత్రి ఒంటిగంట వరకు విచారణ కొనసాగింది. విచారణ అనంతరం రఘురామకృష్ణరాజుకు డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. సామాజిక వర్గాల మధ్య విద్వేషాన్ని పెంచేలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందని రఘురామకృష్ణరాజును సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వంలోని వివిధ హోదాల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకున్నారని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ప్రభుత్వ వ్యవస్థల పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లేలా ఎందుకు వ్యాఖ్యలు చేశారంటూ రఘురామకృష్ణంరాజును అధికారులు ఆరా తీశారు. ఇవాళ సీఐడీ అధికారులు రఘురామకృష్ణరాజును మరోసారి విచారిస్తున్నారు.
మరోవైపు రఘురామ అరెస్టుపై ఏపీ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. నిబంధనల ప్రకారం ఎంపీని అరెస్టు చేయలేదని రఘురామ తరపున న్యాయవాదులు పిటిషన్‌లో పేర్కొన్నారు. రఘురామకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ పిటిషన్‌పై శనివారం మధ్యాహ్నం విచారణ జరపనుంది న్యాయస్థానం. విచారణ పూర్తయ్యే వరకు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చవద్దని హైకోర్టు తెలిపింది. సీఐడీ అధికారుల కస్టడీలో ఉన్న రఘురామ కృష్ణరాజుకు ఆహారం, వైద్యం, వసతి తదితర సదుపాయాలు కల్పించాలని పేర్కొంది.
కాగా, ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యానించారన్న అభియోగంపై ఎంపీ రఘురామ కృష్ణరాజును హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి ఆయనను గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి తీసుకువచ్చారు. రఘురామను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఆయనపై ఐపీసీ 124 (A), 153(A), 505, 120 (b) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.