Monday, November 18, 2024

సీఎం జగన్‌కు రఘురామ మరో లేఖ.. ఏపీలో జర్నలిస్టుల దుస్థితిపై ప్రస్తావన

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి నరసాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖాస్ట్రాలు కొనసాగుతున్నాయి. తాజాగా నవ ప్రభుత్వ కర్తవ్యాల పేరుతో 9వ లేఖ రాశారు. రాష్ట్రంలోని జర్నలిస్టుల దుస్థితిపై లేఖలో ప్రస్తావించారు. ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వివాదానికి కేంద్ర బిందువుగా మారిందన్నారు. ప్రభుత్వంపై జర్నలిస్టులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు.

‘’జర్నలిస్టులకు ప్రభుత్వ గుర్తింపు ఇచ్చే అక్రిడిటేషన్ కమిటీలో ప్రభుత్వ ప్రతినిధులు, వివిధ మీడియా సంస్థల నుంచి జర్నలిస్టులు, జర్నలిస్టు యూనియన్ నాయకులు సభ్యులుగా ఉంటారు. అయితే మన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎక్రిడిటేషన్ కమిటీలో ఒక్క జర్నలిస్టు కూడా లేడు. ఈ విషయంపై ఏ జర్నలిస్టు సంఘం కూడా మాట్లాడటం లేదు అంటే క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఏ కారణమో తెలియదు కానీ ఒక్క సమావేశం కూడా జరుపుకోకుండానే ఆ కమిటీని రద్దు చేసేశారు కూడా. జర్నలిస్టు ఎక్రిడిటేషన్ కమిటీని రద్దు చేయడం కూడా పలు నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఆ తర్వాత మళ్లీ పైన చెప్పిన అందరు ప్రతినిధులు సభ్యులుగా మరొక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత మన ప్రభుత్వం కొన్ని నిబంధనలు రూపొందించింది. జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డు పొందేందుకు (తన పనికి సంబంధించిన) ఆధారాలను సమర్పించాలని కోరింది. గతంలో జారీ చేసిన కార్డులను భద్రపరచుకోలేని జర్నలిస్టులు అందరూ కూడా ఈ నిబంధనతో కొత్త కార్డు పొందలేకపోయారు.

జర్నలిస్టు సోదరులు చెబుతున్నది ఏమిటంటే జీవో నెం 142 జారీ చేయడం ద్వారా ఎక్రిడిటేషన్ కార్డుల జారీలో తమకు తీరని అన్యాయం చేశారని, అక్రిడిటేషన్ కమిటీ నుంచి జర్నలిస్టులను తొలగించడం ఈ జీవో జారీ పర్యవసానమే. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ లు మంజూరు చేసేందుకు 2005లో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 92 స్థానంలో మన ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 142ను సవాల్ చేస్తూ కొందరు జర్నలిస్టులు అందుకే హైకోర్టును ఆశ్రయించారు. గత రెండు సంవత్సరాలుగా మన ప్రభుత్వం జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులను జారీ చేయలేదు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారుగా 40,000 దరఖాస్తులు మన సమాచార శాఖ వద్ద పడి ఉన్నాయి. 60 సంవత్సరాల వయసు దాటిన కొందరు సీనియర్ జర్నలిస్టులకు మాత్రమే గౌరవ సూచకంగా ఫ్రీలాన్స్ జర్నలిస్టు క్యాటగిరి కింద అక్రిడిటేషన్లు జారీ చేశారు. జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డులు పొందడంలేదు సరికదా అసలు దరఖాస్తు చేసుకోవడానికే ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

మీరు పాదయాత్ర చేసే సందర్భంలో జర్నలిస్టుల సమస్యలు అన్నీ పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. అయితే మీరు ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రభుత్వ వాణిని ప్రజలకు వినిపించే అతి ముఖ్యమైన ప్రభుత్వ ప్రచార సాధనం అయిన ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ ప్రచురణనే నిలిపివేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని వెల్లడించే ఆ మ్యాగజైన్ ముద్రణ నిలిపివేయడమే తొలి తప్పిదం. గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల ఆరోగ్య భద్రతకు ఒక స్కీమ్ ఉండేది. జర్నలిస్టులు రూ.1200 చెల్లిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక శాఖ నుంచి అంతే మొత్తం చెల్లించి ప్రభుత్వం జర్నలిస్టులకు పటిష్టమైన ఆరోగ్య భద్రత (హెల్త్ ఇన్ ష్యూరెన్స్) కల్పించేది. గత రెండు సంవత్సరాలుగా మీరు దీన్ని అమలు చేయడం లేదు. ఈ కరోనా మహమ్మారి కాలంలో వందలాది మంది జర్నలిస్టులు మరణించారు. ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి సాయం అందలేదు. ఎక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు కరోనాతో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.5 లక్షలు చెల్లిస్తామని మీరు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ ఎవరికి చెల్లింపులు చేయలేదు. ఎక్రిడిటేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులు అందరూ ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులే. అయితే ఏ ఆసుపత్రి కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద జర్నలిస్టులకు ఈ రోజు వరకూ సాయం చేయలేదు.

కరోనా మహమ్మారి సమయంలో క్షేత్ర స్థాయిలో పని చేస్తూ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న జర్నలిస్టులను కరోనా 19 వారియర్స్ తరహాలోనే, వారికి ఇస్తున్నట్లుగానే జర్నలిస్టులకు కూడా రూ.50 లక్షల జీవిత బీమా సౌకర్యం కల్పించాలి. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు ఇతర సంబంధిత సిబ్బంది తరహాలోనే జర్నలిస్టులను, మీడియా సిబ్బందిని తక్షణమే ఫ్రంట్ లైన్ వారియర్స్ జాబితాలో చేర్చాలి. కోవిడ్ 19 పరిస్థితులలో కేరళ, ఒడిసా ప్రభుత్వాలు ప్రతి ఎక్రిడిటేటెడ్ జర్నలిస్టుకు రూ.10 వేలు ఎలవెన్సుగా చెల్లిస్తున్నాయి. రెవెన్యూ శాఖ అధికారులు, వైద్య సిబ్బంది, పోలీసులు పని చేస్తున్న విధంగానే జర్నలిస్టులు కూడా ఎంతో కష్టపడి పని చేస్తున్నారు. జరుగుతున్న ఈ పరిణామాలతో జర్నలిస్టులు మన ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అక్రిడేషన్ కార్డుల జారీ, ఆరోగ్యశ్రీ హెల్త్‌ కార్డు విషయంలోనూ సమస్యలు తీర్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. జర్నలిస్టులను తక్షణమే ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా గుర్తించాలి’’ అని ఎంపీ రఘురామ లేఖలో డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇది కూడా చదవండి: టీఆర్ఎస్ కంటే ముందున్న ఈటల!

Advertisement

తాజా వార్తలు

Advertisement