(ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్) విజయవాడ ఎంపీ కేశినేని నాని కి టీడీపీ షాక్ ఇచ్చింది.. ఈసారి సీటు ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం కల్పిస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు సమాచారం అందించారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని శుక్రవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
పార్లమెంట్ అభ్యర్థిగా వేరే వారిని నియమించిన నేపథ్యంలో పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని అధినేత చెప్పిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఆదేశాలను శిరసా వహిస్తానని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఈనెల 7వ తేదీన జరిగే బీసీ మహాసభకు ఇన్చార్జిగా వేరే వారిని నియమించినట్లుగా అధినేత నుండి తనకు వర్తమానం అందిందని చెప్పారు.
గురువారం సాయంత్రం చంద్రబాబు ఆదేశాల మేరకు మాజీ మంత్రి ఆలపాటి రాజా ,ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టం రఘురాం,మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ల నారాయణ తనను కలసి 7 వ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇంచార్జ్ గా చంద్రబాబు నియమించారని కాబట్టి ఆ విషయంలో నన్ను కలగ చేసుకోవద్దని చంద్రబాబు చెప్పారని తనకు తెలియజేసినట్లు చెప్పారు.
అట్లాగే రాబోయే ఎన్నికలో నా స్థానంలో విజయవాడ లోకసభ అభ్యర్థిగా వేరేవారికి అవకాశం ఇవాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారలో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారని తనకు వర్తమానం అందించారన్నారు. అధినేత చంద్రబాబు ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసావహిస్తానని వారికి తాను హామీ ఇచ్చినట్లు చెప్పారు.