Friday, November 22, 2024

AP: రెండో అన్నా క్యాంటీన్… ప్రారంభించిన ఎంపీ కేశినేని శివనాథ్…

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : ఎన్టీఆర్ జిల్లాలో ఏపీలోనే రెండవ అన్నా క్యాంటీన్ ను నందిగామలో ఎంపీ కేశినేని శివనాద్ ప్రారంభించారు.నిరుపేదలకు ఆకలి తీర్చే మంచి రోజులు మళ్లీ ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురై మూతపడిన అన్నా క్యాంటీన్లకు పునరజీవం వచ్చింది. నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఆకలి తీర్చే ఆనందఘడియలు ప్రారంభమయ్యాయి. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రాగా గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు మొదటి అన్నా క్యాంటీన్ ను ప్రారంభించగా, ఎన్టీఆర్ జిల్లాలో ఏపీలోనే రెండవ అన్నా క్యాంటీన్ ను నందిగామలో ఎంపీ కేశినేని శివనాద్ ప్రారంభించారు. నందిగామ పట్టణంలోని రైతు బజారులో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను మంగళ వాయిద్యాలు వేద మంత్ర చరణల నడుమ ఎంపీ కేసినేని శివనాద్ శుక్రవారం శిలా పలకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఎంపీ స్వయంగా నిరుపేదలకు అల్పాహారాన్ని వడ్డించడంతోపాటు స్వయంగా వారితో కలిసి అల్పాహారాన్ని తీసుకున్నారు.

విజయవాడలో…
నగరపాలక సంస్థ పరిధిలోని పటమట కోనేరు బసవయ్య చౌదరి జడ్పీహెచ్ఎస్ బుడమేరు జంక్షన్, గాంధీనగర్ వన్ టౌన్ గాంధీ పార్క్ వద్ద అన్నా క్యాంటీన్లను ప్రజాప్రతినిధులు, అధికారులు శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. నగరంలోని నలుమూలల ప్రజలకు అందుబాటులో విధంగా ఏర్పాటు చేసిన ఈ అన్నా క్యాంటీన్లను ఎంపీ కేశినేని శివనాద్, జిల్లా కలెక్టర్ సృజన, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, బోండా ఉమామహేశ్వరరావు, సుజనా చౌదరి, నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముందుగా టోకెన్ కౌంటర్, డైనింగ్ ఏరియాలను ప్రారంభించి, లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వయంగా వడ్డించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాటులతోపాటు చేతులు శుభ్రం చేసుకునేందుకు చేసిన ఏర్పాట్లు, మరుగుదొడ్లు తదితర వాటిని నాయకులు పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ…. జిల్లాలోని అన్నా క్యాంటీన్ల నిర్వహణ భారం ప్రభుత్వంపై పడనీయకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజల ఆకలి తీర్చడమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమ‌న్న ఆయన తన పాలనలో నిరుపేదల కడుపు మార్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ సృజన మాట్లాడుతూ… మెనూ ప్రకారం అన్నా క్యాంటీన్లలో అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన ఏర్పాట్లు చేస్తున్నామని, నిర్వహణపరంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేలు మాట్లాడుతూ… పేదలకు పట్టెడన్నం పెట్టే బృహత్తర కార్యక్రమంలో భాగస్వాములమైనందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. పండుగ వాతావరణంలో లబ్ధిదారుల సమక్షంలో అల్పాహారం సేకరించడం ఆనందాన్ని కలిగించిందన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement