న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో పూర్తి కానున్న పలు కేంద్ర ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. గురువారం జీవీఎల్ ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు. హస్తకళా వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నరేంద్ర మోదీకి బహూకరించారు. అనేక ప్రతిష్టాత్మక జాతీయ అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసేందుకు విశాఖపట్నం పర్యటనకు రావాల్సిందిగా అభ్యర్థించారు.
ప్రధానికి లేఖ అందజేసి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల గురించి వివరించారు. రూ.26 వేల కోట్లతో విశాఖపట్నం హెచ్పీసీఎల్ పెట్రోలియం రిఫైనరీ విస్తరణ, ఆధునికీకరణ ప్రాజెక్ట్, విశాఖ ఐఐఎం ఆధునికీకరణ, క్రూయిజ్ టెర్మినల్ మొదలైన వాటి వివరాలను ప్రధానికి వెల్లడించారు. విశాఖపట్నానికి మంజూరైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కొత్త కార్యాలయ సముదాయంతో సహా మంజూరైన ఇతర అనేక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాలని జీవీఎల్ నరసింహారావు ఆయనను కోరారు. సుమారు రూ. 400 కోట్లతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఆధునికీకరణ ప్రాజెక్ట్, రూ.385 కోట్ల వ్యయంతో 400 పడకల ఈఎస్‌ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మెగా ఫిషింగ్ హార్బర్ తదితర అంశాల గురించి ఆయన ప్రస్తావించారు.
వైజాగ్‌లోని తూర్పు నౌకాదళ కమాండ్, ఇతర రక్షణ సంస్థలలో అనేక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలను గురించి కూడా నరేంద్ర మోదీకి సమర్పించిన లేఖలో పేర్కొన్నారు. ప్రధానమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్లే కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలు పూర్తవుతున్నాయని నగర ప్రజలు గుర్తిస్తున్నారని జీవీఎల్ హర్షం వ్యక్తం చేశారు. వీలైనంత త్వరగా విశాఖ పర్యటనకు రావడానికి ప్రయత్నిస్తానని మోదీ హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.