న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విశాఖపట్నం విమానాశ్రయం పునరుద్ధరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని, రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్ అరమనేలను కలిసి వినతిపత్రం సమర్పించారు. పునరుద్దరణ పనుల గురించి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించారు. పునరుద్ధరణ పనుల గురించి నెలల తరబడి విమానాశ్రయం రన్‌వే మూసివేయడం వల్ల ప్రయాణికులకు అసౌకర్యం, వ్యాపార కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని జీవీఎల్ ఆయనకు వివరించారు.
ఇండియన్ నేవీ నియంత్రణలో ఉన్న విశాఖపట్నం విమానాశ్రయంలో చేపట్టనున్న ప్రతిపాదిత రన్‌వే కారణంగా 2023 నవంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు రాత్రి 9.00 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు రన్‌వేని మూసివేయడం వల్ల విశాఖవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటారని వివరించారు. నాలుగైదు నెలల పాటు ఎయిర్‌పోర్ట్ రన్‌వే మూసివేయడం వల్ల వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, రన్‌వే మూసివేత సమయంలో పలు విమానాలు రద్దు కావడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతారని రక్షణ మంత్రికి, కార్యదర్శికి తెలిపారు. ఆధునిక పద్ధతులు, సాంకేతికత ద్వారా విమానాశ్రయ పునరుద్ధరణ పనుల వ్యవధిని బాగా తగ్గించవచ్చని చెప్పారు.
హైదరాబాద్, పూణే విమానాశ్రయాల్లో ఆధునిక పద్ధతులు, సాంకేతికతతో నెలరోజుల వ్యవధిలో పునరుద్ధరణ పనులు పూర్తి చేశారని జీవీఎల్ వారికి వివరించారు. విశాఖ విమానాల రాకపోకల షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని రన్‌వే మూసివేసే సమయాన్ని రాత్రి 11 నుండి ఉదయం 6 గంటల వరకు కుదించాల సూచించారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశం అనంతరం జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ తన విజ్ఞప్తులపై రక్షణ మంత్రి, ఆ శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారని, విశాఖ ఎయిర్‌పోర్టులో పునరుద్ధరణ పనులు త్వరగా పూర్తి చేసే అంశాన్ని తప్పనిసరిగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు.