విశాఖపట్నం – వైసిపి విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్ చంద్ర, వారి ఆడిటర్ గన్నపనేని వెంకటేశ్వరరావు (జీవీ) కిడ్నాప్ డబ్బుకోసం జరిగిదంటూ వైజాగ్ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ తెలిపారు.. కిడ్నాప్ పై ఎంపి నుంచి ఫిర్యాదు వచ్చిన రెండు గంటలలోనే సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా కిడ్నాపర్స్ ను పట్టుకుని, ఎంపి కుటుంబ సభ్యులను పోలీసులు విడిపించారు..
ఈ కేసు వివరాలను విశాఖ పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ మీడియా కు వివరిస్తూ, . విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కు స్థిరాస్తి వ్యవహారం కారణం కాదని తెలిపారు. డబ్బు కోసమే ఎంపీ భార్య, కుమారుడ్ని, వారి ఆడిటర్ ను కిడ్నాప్ చేశారని స్పష్టం చేశారు. ఈ నెల 13న ఎంపీ కుమారుడు శరత్ చంద్రను కిడ్నాప్ చేశారని, ఆపై శరత్ తల్లిని కూడా బెదిరించి బంగారం, నగదు తీసుకున్నారని వెల్లడించారు. ఆడిటర్ వద్ద ఎక్కువ డబ్బు ఉంటుందని ఆయనను కూడా పిలిపించారని తెలిపారు. జీవీ, శరత్ చంద్ర ఖాతాల నుంచి రూ.కోటిన్నరకి పైగా లావాదేవీ జరిగిందని సీపీ పేర్కొన్నారు.
ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ను వారి కారులోనే ఎక్కించుకుని ఇంటి నుంచి బయటికి తీసుకువచ్చారని వెల్లడించారు. అయితే, తన ఆడిటర్ ఫోన్ స్పందించడంలేదని ఎంపీ చేసిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగినట్టు సీపీ త్రివిక్రమ వర్మ వివరించారు. టెక్నాలజీ సాయంతో కిడ్నాపర్లను పట్టుకున్నామని చెప్పారు. ఈ ఘటనలో ఏడుగురి ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా తేలిందని, ఇప్పటివరకు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని వివరించారు. వారితో ఒకరు రౌడీ షీటర్ హేమంత్ కుమార్ గా గుర్తించామన్నారు..
“ఎంపీ సత్యనారాయణ నేటి ఉదయం 8 గంటలకు ఫోన్ చేసి వారి ఆడిటర్ జీవీ కిడ్నాప్ అయినట్టు అనుమానంగా ఉందని చెప్పారు. ఎంపీ నివాసంలో సీసీ కెమెరాలు లేవు. వెంటనే పోలీసు బృందాలు అప్రమత్తం అయ్యాయి. ఆడిటర్ జీవీకి ఫోన్ చేస్తే ఆయన లైన్ లోకి వచ్చారు,నాకేమీ కాలేదు, శ్రీకాకుళం నుంచి వస్తున్నాను అని చెప్పారు. కానీ టెక్నికల్ ఎవిడెన్సులు చూస్తే, ఆడిటర్ జీవీ ఏదో పొంతన లేకుండా మాట్లాడినట్టు అర్థమైంది. సెల్ ఫోన్ సిగ్నల్ రుషికొండ ఏరియాను చూపిస్తోంది. వారు విజయనగరం వైపు పారిపోయే అవకాశం ఉన్నట్టు గుర్తించాం. దాంతో పోలీసులు వారి వాహనాన్ని చేజ్ చేశారు. చివరికి కిడ్నాపర్లు ఉన్న కారు సీఐ వాహనాన్ని ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న తుప్పల్లోకి వెళ్లిపోయింది. దాంతో హేమంత్, రాజేశ్ అనే ఇద్దరు వ్యక్తులు కారు దిగి పరిగెత్తారు. వాళ్లిద్దరినీ పోలీసులు వెంటాడి పట్టుకున్నారు.
కిడ్నాపర్లలో ఒకరు గతంలో ఎంపీకి చెందిన కంపెనీలో సబ్ కాంట్రాక్టరుగా పనిచేశారు. ఎంపీ వద్ద బాగా డబ్బు ఉంటుందని భావించి ఈ కిడ్నాప్ కు ప్రయత్నించారు. డబ్బు కోసమే ఈ కిడ్నాప్ చేశారు. కిడ్నాపర్లలో హేమంత్ అనే వ్యక్తిపై హత్య, పలు కిడ్నాప్ లు సహా 12 కేసులు ఉన్నాయి. హేమంత్ స్వస్థలం భీమిలి” అని సీపీ తివిక్రమ వర్మ వివరించారు. ఈ కేసును చ్చేధించడంలో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులను ఆయన అభినందించారు..