Friday, November 22, 2024

మరికొద్ది రోజుల్లో ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు.. ఏర్పాట్లలో అధికారులు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్లు పొందడానికి మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది. తొలుత ఏప్రిల్‌ 1 నుంచే ప్రభుత్వ ఆధీనంలో సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు నిర్ణయించారు. సాంకేతిక సహకారం కోసం బిడ్డర్ల ఎంపిక పూర్తి కాకపోవడంతో మరికొద్ది రోజులు జాప్యం జరగొచ్చని చలనచిత్ర, నాటక రంగ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) అధికారులు చెపుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర టెక్నలాజికల్‌ సంస్థ(ఏపీటీఎస్‌) తక్కువ రేటుకు కోట్‌ చేసి ఎల్‌-1గా నిలిచిన ‘జస్ట్‌ టిక్కెట్స్‌’ సంస్థను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బిడ్డింగ్‌కు సంబంధించి ఏపీటీఎస్‌ అధికారిక లాంఛనాలు పూర్తి చేసి ఏపీఎఫ్డీసీకి పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత ధియేటర్ల లే-అవుట్లు తయారు చేసుకొని ప్రభుత్వ వెబ్‌సైట్‌ను సిద్ధం చేస్తారు. ఆ తర్వాత నుంచే ఆన్‌లైన్‌ టిక్కెట్ల అమ్మకాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ నెలాఖరులోగా ఈ తతంగం పూర్తికాని పక్షంలో మే మొదటి వారం నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉందని చెపుతున్నారు. వీలైనంత తొందరగా ఆన్‌లైన్‌ టిక్కెట్‌ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు మాత్రం అధికారులు ఏర్పాట్లు చేశారు.

గతంలో రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్‌ విక్రయాలకు నిర్ణయించి పరిశ్రమ వర్గాలతో పలు సంప్రదింపులు జరిపింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, సినీ ప్రముఖులు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఏపీఎఫ్‌డీసీ నేతృత్వంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చి ప్రైవేటు ఏజెన్సీల కంటే తక్కువ రేటుకే సినిమా టిక్కెట్లు ఇవ్వాలనేది ప్రభుత్వ నిర్ణయం. వివిధ ప్రైవేటు సంస్థలు సినిమా టిక్కెట్ల ఆన్‌లైన్‌ విక్రయాలపై రూ.20 వరకు చార్జీ వసూలు చేస్తున్నాయి. ఈ ఖర్చు నుంచి సినీ ప్రేక్షకులకు ఊరట కలిపించేందుకు ప్రభుత్వం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి మాదిరిగానే ధియేటర్లలో సైతం సినిమా టిక్కెట్లను ప్రభుత్వ పోర్టల్‌ ద్వారానే చేపట్టాలి. ప్రభుత్వ ఆదేశాల నేపధ్యంలో ఏపీటీఎస్‌ టెండర్లు పిలవగా జస్ట్‌ టిక్కెట్‌ సంస్థ ఎల్‌-1గా నిలిచినట్లు తెలిసింది. చెన్నై కేంద్రంగా నిర్వహించే జస్ట్‌ టిక్కెట్‌ సంస్థలో ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్‌ కుమారుడు వెంకటేష్‌ డైరెక్టర్‌గా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధికారిక లాంఛనాల తర్వాత ఏపీఎఫ్‌డీసీకి పంపనున్నారు. ఆ తర్వాత ధియేటర్ల లే-అవుట్లు తీసుకొని ఎఫ్‌డీసీ పోర్టల్‌లో పొందుపరుస్తారు. అప్పటి నుంచి ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలు జరుపుతామని అధికారులు తెలిపారు. ఏప్రిల్‌ నెలాఖరులోగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వెబ్‌సైట్‌ అందుబాటులోకి రానుంది. ఒకవేళ జాప్యం చోటు చేసుకుంటే మే మొదటి వారం నుంచి అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement