తిరుమల కొండమీద.. శ్రీవారి సన్నిధిలో ఎల్‌ఈడీ స్క్రీన్‌పై సినిమా పాటలు ప్లే అయిన ఘటనలో అధికారులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. తిరుమల ఆలయంలోని ఐదు ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై ఇతర మూడు చానెల్‌లను ప్రసారం చేసినందుకు గ్రేడ్-1 అసిస్టెంట్ టెక్నీషియన్ పీ రవికుమార్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సస్పెండ్ చేసింది. రవికుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా టీటీడీ రేడియో & బ్రాడ్‌కాస్టింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజనీర్ ఏవీవీ కృష్ణ ప్రసాద్‌కు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. హిందూ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన తిరుమల ఆలయం వద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లపై మొన్న శుక్రవారం సినిమా పాటలను ప్లే చేయడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ఇది కఠినమైన నిబంధనలు ఉల్లంఘించినట్టేనని చాలామంది టీటీడీ తీరుపై ఆసంతృప్తి వ్యక్తం చేశారు..
కాగా, ఈ ఘటనపై టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి తీవ్రంగా స్పందించి వెంటనే విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీవీఎస్వో నరసింహకిషోర్‌ను ఆదేశించారు. దీనికి సంబంధించి విజిలెన్స్ అధికారులు ఆస్థాన మండపంలోని కంట్రోల్ రూమ్, కమాండ్ కంట్రోల్ రూమ్‌లోని పీఏసీ-4 సీసీ కెమెరాలతో పాటు సంబంధిత టీటీడీ ఉద్యోగుల ఫుటేజీలను పరిశీలించారు.సిబ్బంది అంతా వెళ్లిపోగానే రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ విభాగంలోని టీవీ సెక్షన్ కంట్రోల్ రూమ్‌లోకి అసిస్టెంట్ టెక్నీషియన్ రవికుమార్, అతని స్నేహితుడు గోపీకృష్ణ ప్రవేశించినట్లు గుర్తించారు. ఘటన జరిగిన సాయంత్రం 5.28 గంటల వరకు గోపీకృష్ణ కంట్రోల్ రూమ్‌లో ఒంటరిగా ఉన్నట్టు తేలింది. దీనికి బాధ్యుడిగా రవికుమార్‌పై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు అసిస్టెంట్ ఇంజనీర్ ఏవీవీ కృష్ణప్రసాద్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.