Thursday, September 19, 2024

MOU – ఏపీలో ఫాక్స్‌కాన్‌ భారీగా పెట్టుబడులు….

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – అమరావతి -: ఎన్నికల ముందు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన లోకేష్, ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా సోమవారం ఉదయం ఫాక్స్ కాన్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఉండవల్లి నివాసానికి చేరుకున్న ఫాక్స్ కాన్ బృందానికి ఎదురెళ్లి లోకేష్ స్వాగతం పలికారు.

కంపెనీ ప్రతినిధులకు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వివరించారు. 2014 నుండి 2019 వరకూ రాష్ట్రంలో పెట్టుబడులు ఆకర్షించడానికి తీసుకున్న చర్యలు, తీసుకొచ్చిన ఎలక్ట్రానిక్స్, ఈవీ పాలసీల గురించి వివరించారు. కియా కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చిన విధానాన్ని ఒక కేస్ స్టడీ గా వివరించారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా రాయితీలు కల్పించే విధానం కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. త్వరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నామని తెలిపారు.

ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ ఏర్పాటు చేయండి

- Advertisement -

సీఎం చంద్రబాబు చొరవతో 2014 నుండి 2019 వరకూ అనేక కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి. అందులో ఫాక్స్ కాన్ కూడా ఒకటి. 14 వేల మంది మహిళలకు నాడు మీరు ఉద్యోగాలు కల్పించారు. ఇప్పుడు ఫాక్స్ కాన్ ఇండియా తన కార్యకలాపాలను విస్తరించాలని చూస్తోంది. అందులో భాగంగా కేవలం ఒక ప్లాంట్ పెట్టాలని నేను మిమ్మల్ని కోరడం లేదు. ఫాక్స్ కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను లోకేష్ కోరారు.

ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం తాము అందిస్తామని లోకేష్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్య సాధనలో ప్రధాన భూమిక పోషించాలని లోకేష్ ఫాక్స్ కాన్ ప్రతినిధులను కోరారు. అనుమతుల నుండి ఉత్పత్తి వరకూ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. మీకు ఎలాంటి సహకారం కావాలన్నా నేనే స్వయంగా రంగంలోకి దిగుతానని వారికి లోకేష్ భరోసా కల్పించారు.ఫాక్స్ కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామని అన్నారు.

ఏపీలో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీ

ఫాక్స్ కాన్ కంపెనీ ఇండియన్ రిప్రజెంటేటివ్ వి.లీ మాట్లాడుతూ.. పెట్టుబడులు ఆకర్షణలో సీఎం చంద్రబాబు చూపించే చొరవను కొనియాడారు. ఏపీతో తమకు మంచి అనుబంధం ఉందని.. కానీ గత ఐదేళ్లలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమకు అనేక ప్లాంట్లు ఉన్నాయని, ఇండియాలో భారీ ఎత్తున కార్యకలాపాలు విస్తరించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.

త్వరలోనే తమ బృందం ఏపీ అధికారులతో చర్చించి.. ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నామని అన్నారు. మీ 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యానికి మా వంతు సహకారం అందిస్తామని లీ, లోకేష్ తో అన్నారు.

త్వరలోనే ఏపీలో కార్యకలాపాల విస్తరణఈ రోజు జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పించేందుకు ఫాక్స్ కాన్ ప్రతినిధులు సూత్రప్రాయంగా అంగీకరించారు. త్వరలోనే తమ బృందం పర్యటించి పూర్తిస్థాయి ప్రణాళికతో మీ ముందుకు వస్తుందని కంపెనీ ప్రతినిధులు లోకేష్ కు వివరించారు.

ప్రభుత్వం తరపున మీకు పూర్తి సహకారంతో పాటు వీలైనంత త్వరగా కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తామని లోకేష్ కంపెనీ ప్రతినిధులతో అన్నారు.

ఈ సమావేశంలో ఫాక్స్ కాన్ ఇండియన్ రిప్రజెంటేటివ్ వి.లీ, డైరెక్టర్ టూ ఫాక్స్ కాన్ ఛైర్మన్ ఆఫీస్ సెంథిల్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ భరత్ దండి, మేనేజర్ హానా వాంగ్, మేనజర్ వెక్టర్ చెన్, అసిస్టెంట్ మేనేజర్ గ్యారీ, ఐటి, ఎలక్ట్రానిక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరబ్ గౌర్ పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement