కోనసీమ, ప్రభన్యూస్ : కోనసీమ జిల్లా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ తాటాకిల్లు ఇంటికి నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో లోపల నిద్రిస్తున్న తల్లికూతుళ్ళు సజీవదహనమయ్యారు. తల్లి సాధనాల మంగాదేవి (44), మేడిశెట్టి జ్యోతి (20)ల శరీరాలు బొగ్గుల్లా మాడిపోయాయి. గుర్తించేందుక్కూడా వీల్లేని రీతిలో మాంసముద్దల్లా మిగిలారు. మేడిశెట్టి జ్యోతి ప్రస్తుతం నాలుగునెలల గర్భిణి. కొమరగిరిపట్నం ఆకుల వారి వీధికి చెందిన సాధనాల లింగన్న, మంగాదేవి దంపతులకు జ్యోతి ఒక్కరే సంతానం. ఆమె దెయ్యాలపాలెం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మేడిశెట్టిసురేష్‌ను ప్రేమించింది. అయితే వీరి పెళ్ళికి ఆమె కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. దీంతో ఐదుమాసాల క్రితం సురేష్, జ్యోతిలు ఇంటినుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు. అనంతరం జ్యోతి తల్లిదండ్రులు ఈ వివాహాన్ని ఆమోదించారు. ఆషాడం కావడంతో గతనెల 26వ తేదీన సురేష్ తన భార్య జ్యోతిని పుట్టింట్లో అప్పగించాడు. ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి సురేష్ అత్తారింటికొచ్చాడు.
భార్యకు ఆహారం, కూల్‌డ్రింగ్స్ ఇచ్చి ఇంటికెళ్ళిపోయాడు. భోజనానంతరం లింగన్న, మంగాదేవి, జ్యోతిలు తమ తాటాకింట్లోని రెండు వేర్వేరు గదుల్లో నిద్రించారు. అర్ధరాత్రి దాటాకా ఒక్కసారిగా ఆ ఇంటికి నిప్పంటుకుంది. ఇంటి నుంచొచ్చిన హహాకారాల్తో పరిసరవాసులు ఉలిక్కిపడిలేచారు. పరుగుపరుగున వెళ్ళి మంట ల్ని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఒఎన్‌జిసికి చెందిన అగ్నిమాపక వాహనం వచ్చి మంటల్ని అదుపు చేసింది. అప్పటి కే విషాదం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో లింగన్న బ్రతికి బయటపడ్డాడు. మంగాదేవి, జ్యోతిలు సజీవదహనమయ్యారు. కాగా పోలీసులు జ్యోతి భర్త సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ దుర్ఘటనకు సురేష్‌కు సంబంధముందని సందేహిస్తున్నారు. సురేష్‌ను ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. మంత్రి విశ్వరూప్, జెసి ధ్యానచంద్రలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.