కర్నూలు, (ప్రభ న్యూస్) : తుంగభద్ర నదిలో దూకి తల్లి కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తెలంగాణ పరిధిలోని అలంపూర్ వద్ద మంగళవారం చిన్నారి మృతదేహం కనిపించింది. దీంతో అక్కడే ఇంకా తల్లి మృతదేహం కోసం జాలర్లు వెతుకుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు పట్టణంలో నివాసం ఉంటున్న దేవమాడ గ్రామానికి చెందిన మమతారెడ్డి (31), కూతురు జీవన (04) ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లి ఇక తిరిగి రాలేదు. అయితే.. తాము అలంపూర్లో ఉన్నట్టు అదే రోజు రాత్రి 7 గంటల ప్రాంతంలో మమతారెడ్డి తన సోదరి రమాదేవికి ఫోన్ చేసి చెప్పింది. ఆ తర్వాత ఆమె ఫోన్ రింగ్ అవుతున్నా మాట్లాడకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానపడ్డారు. ఈ క్రమంలోనే మమతారెడ్డి తన వెంట తెచ్చుకున్న హ్యాండ్ బ్యాగ్, మొబైల్ ఫోను, బంగారం తాళిబొట్టు, పుష్కర ఘాటుపై పెట్టి నదిలో తన కూతురుతో సహా దూకి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తెలుస్తోంది.
ఇక.. ఆదివారం రాత్రి ఇంటి నుండి బయటకు వెళ్లిన మమతా రెడ్డి, జీవన ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆమె భర్త ప్రవీణ్ రెడ్డి, మృతురాలి తల్లి నాగేశ్వరమ్మ సమీప బంధువుల వద్ద ఆరా తీశారు. సోమవారం కూడా వెతికినా జాడ తెలియరాలేదు. దీంతో నాగేశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు మొదట మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గాలింపులో భాగంగా చివరికి అలంపూర్ పుష్కర ఘాట్ వద్ద తుంగభద్ర నదిలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. జాలర్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా చిన్నారి జీవన మృతదేహం లభించింది. మమతా రెడ్డి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.