భూమ్మీదనే అరుదైన పక్షిజాతి
బిడియం అసలు స్వభావం
మనిషిని చూస్తే మహా సిగ్గు
ఆగ్రహం వస్తే మహోగ్రరూపం
డైనోసార్ ఈ పక్షి వారసత్వం
జన్మస్థలం ఆస్ట్రేలియాలోని న్యుగినియా దీవులు
భారత్‌లోని కోల్‌కతాలో సంచారం
72 కిలోల అత్యంత బరువు
అయినా.. 50 కిలోమీటర్ల వేగంతో పరుగు
నీటిలోనూ గజ ఈతగాళ్లు పోటీపడాల్సిందే
(ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్) చిట్టి చిలకమ్మ పలుకులు, పిచ్చుక గంతులు, నెమలి చిందులు, కోడిపుంజు కొట్లాటలు.. ఇవ్వన్నీ మనిషికి వినోదం పంచే పక్షులే. నిజంగా పక్షులన్నీ మానవ జాతితో అనుసంధాన జీవులే. పకృతి ఒడిలో సేదతీరే మనిషికి పక్షుల కిలకిలరావాలు ఆహ్లాదపర్చటమే కాదు.. అప్రమత్తం చేస్తుంటాయి. కానీ, సహజ సిద్ధంగా.. సిగ్గు మొగ్గలేసే ఓ పక్షి ఉంది.. అది సిగ్గుపడితే సింగారమే కానీ, దానంత డేంజరస్ ఈ భూమ్మీదనే లేదని చెప్పుకోవాలి. ఈ పక్షి అత్యంత ప్రమాదకరం. మనిషి కనపడితే సిగ్గుతో ఆమడ దూరం పారిపోయే పక్షి.. తనకు కోపం వస్తే వెంటాడి వేటాడి చంపేస్తుంది. ఈ బర్డ్‌పేరు కాసోవరీ. బిడియంతో పక్కకు తప్పుకునే ఈ పక్షి కాస్త, ఆగ్రహంతోనూ అంతలా చెలరేగిపోతుంది. ప్రమాదకర డైనోసార్లను కేవలం సినిమాలో చూస్తే.. అదే డీఎన్ఏతో కాసోవరీ.. ఇక కాస్కోవరీ అంటోంది.
అసలు కథేంటంటే..
అది అందమైన పక్షి. బలమైన రక్కసి. డైనోసార్ సంతతి. ఆస్ట్రేలియా, న్యూగినియా ప్రదేశాలు దీని జన్మస్థలం. ఈ అరుదైన పక్షి ఇప్పుడు భారత్‌లోని కోల్‌కతాలోనూ తిరుగుతోంది. రంగురంగుల వన్నె చిన్నెల ఈ కాసోవరి ఈ భూ గ్రహంపైనే అరుదైన ఏవియన్ జాతి పక్షి. ఉష్ట్ర పక్షి, ఈము తరహాలో పరిమాణంలో కూడా కాసోవరి చాలా పెద్దది. దాదాపు ఆరడుగుల ఎత్తుంటుంది. 72.5 కిలోల బరువు. దీని కాళ్లు మరింత బలిష్టం. ఇవి ప్రధానంగా మూడు రకాలు. కాసురియస్ కాజురియస్, కాసురియస్ అన్పెడిక్యులాటస్ , కాసురియస్ బెన్నెట్టి. ఇక.. ఇవి దూకుడులోనూ దుమారం రేపుతాయి. గంటకు 50కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతాయి. అంతేకాకుండా నీటిలో గజ ఈతగాళ్లతో పోటీ పడగలవు. కప్ప తరహాలో ఉభయ జాతికి చెందినది ఈ పక్షి. భూమ్మీద , నీటిలోనూ బతుకగలవు. నీలి రంగు ముఖం, ఎరుపు లేదా పసుపు తేజస్సు మెడ, శరీరం నిండా దృఢమైన నల్లటి ఈకలు కనిపిస్తాయి.
18 వేల ఏళ్ల చరిత్ర
కాసోవరీ పక్షిని 18 వేల ఏళ్ల కిందటే మనిషి దగ్గరకు తీసుకున్నాడు. ఈ పక్షి సహజ లక్షణం బిడియం. మనిషి కనిపిస్తే పక్కకు తప్పుకొంటుంది. అమెరికాకు చెందిన యేన్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రిస్టినా డగ్లస్ నివేదిక ప్రకారం.. కాసోవరీ 18 వేల ఏళ్ల కిందటే మానవ సమాజంలోకి వచ్చింది. చూడటానికి అతి పెద్ద పక్షి కాగా.. మనిషి పెంపకంలో తన అందచందాలను పంచింది. సహజంగా పిల్లిని ఓ గదిలో బెదిరిస్తే తిరగబడుతుంది. అదే తరహాలో కాసోవరీ కూడా కోపం వస్తే అసలు ఆగదు. మీద పడి కాళ్లతో రక్కేసి, చంపేస్తుంది. 2019లో కాసోవరి అసలు స్వభావం సభ్య సమాజానికి తెలిసింది. ఫ్లొరిడాలో పక్షులను పెంచే ఓ యజమానిని కాసోవరీ చంపేసింది. ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ సిగ్గుల మొగ్గ అత్యంత భయంకరంగా చంపేస్తుందా? అని జనం విస్తుపోయారు. నిజం చెప్పాలంటే కోళ్లు, చిలుకలు, పావురాలకు ముందే కాసోవరి పెంపకాన్ని మనిషి చేపట్టాడు. పకృతిలో పర్యావరణ సమతుల్యానికి మనిషితో జత కట్టిన పక్షి జాతికి కోపం వస్తే.. ఏం చేయగలవో కాసోవరిని చూస్తే తెలిసిపోతుంది. అందుకే బీ అలర్ట్.. పక్షులంటే మమకారం ఉండాలి.. మట్టుబెట్టే ఉపాయం మానుకోవాలి అంటున్నారు పక్షి ప్రేమికులు.