ఒంగోలు, ప్రభన్యూస్ : జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు మోపాడు రిజర్వాయర్‌ఒ 29 అడుగుల పూర్తి స్థాయికి చేరింది. దీనికి తోడు వాగులు, వంకల నుంచి రిజర్వాయర్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 2.09 టీఎంసీల నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్ కట్టకు అడుగు భాగంలో ఐదు చోట్ల నీరు లీకవుతోంది, దీనిని గమనించిన స్థానికులు, రైతులు వెంటనే నీటిపారుదలశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ రిజర్వాయర్ కింద సుమారుగా 20వేల ఎకరాలు సాగవుతోంది. నీరు లీకవుతుండటంతో రైతులు, స్థానికులు తీవ్ర ఆందోళన చేందుతున్నారు. మరో వైపు పామూరు పాత చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతోంది. చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉండడంతో జాయింటు కలెక్టర్ వెంకట మురళి చెరువును సందర్శించారు. అలుగు పారుతున్న నీరు 565 జాతీయ రహదారి పైకి వచ్చి గోపాలపురం ఎస్సీ కాలనీని మంచేసింది. చెరువు కట్టకు గండిపడితే గ్రామాలను ముంచెత్తే ప్రమాదం ఉండటంతో సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటితో రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుండటం, కట్టకు లీకులు ఏర్పడటంతో దిగువున ఉన్న గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. అలుగు ప్రవాహం పెరిగితే చెరువుకు సమీపంలో ఉన్న ఐదు గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. మోపాడు రిజర్వాయర్ అలుగు సామర్ధ్యం పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. రిజర్వామర్‌ను సందర్శించిన ఆయన మాట్లాడుతూ భారీ వర్షాల వల్ల ఎగువ ప్రాంతాల నుంచి అధికంగా నీరు వస్తుండటంతో మోపాడు రిజర్వాయర్ నిండిందన్నారు. కట్టకు ఏర్పడిన లీకులను ఇసుక బస్తాలతో పూడ్చి, నిపుణుల కమిటీ సూచనలతో తగు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital