చిత్తూరు, (ప్రభ న్యూస్ బ్యూరో) : చిత్తూరు జిల్లా బంగారు పాళ్యం మండలం మొగలి ఘాట్ రోడ్డులో ఈ నెల 13న జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై పూర్తి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కమిటీ చైర్‌పర్సన్ జస్టిస్ అభయ్ మనోహర్‌స్రే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌కు నోటీసులు జారీ చేశారు. నెలలోపు పూర్తి నివేదికను సమర్పించాలని వారిని కోరారు.
మొగిలి ఘాట్ రోడ్డులో ఈ నెల 13న ఆర్టీసీ బస్సు రెండు లారీలను ఢీకొనడంతో 8 మంది మృతి చెందగా, 33 మంది గాయపడ్డారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ కేసును సుమోటోగా స్వీకరించింది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
వేగ నియంత్రణపై దృష్టి సారించాలని కోరారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రమాదం జరిగిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి తనకు తెలియజేయాలని ఆదేశించారు. పూర్తి నివేదికను అక్టోబర్ 20లోగా తమకు అందజేయాలని ఆదేశించారు.