అమరావతి, ఆంధ్రప్రభ: మహిళా సాధికారత గురించి పదేపదే వల్లెవేసే ప్రధాని నరేంద్ర మోడీ చట్ట సభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కలిపించే బిల్లును ఎందుకు పెట్టలేదని రాజ్యసభలో సీపీఐ పక్షనేత బినయ్ విశ్వం ప్రశ్నించారు. బీజేపీని వెనుకుండి నడిపే ఆర్‌ఎస్‌ఎస్‌లో మహిళలకు సభ్యత్వం ఇవ్వకపోవడం మహిళల పట్ల వారి దృక్ఫదాన్ని స్పష్టం చేస్తోందని ఆయన తెలిపారు. బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న బినయ్ విశ్వం జాతీయ రాజకీయాలు, మోడీ ప్రభుత్వ విధానాలపై మాట్లాడారు.
గిరిజనుల పట్ల మోడీది మొసలి కన్నీరే తప్ప ఏమాత్రం ప్రేమ లేదన్నారు. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి గిరిజనులకు మేలు చేసినట్లు చెప్పుకోవడం సరికాదన్నారు. నీరు, భూమి, అడవి(జల్, జమీన్, జంగిల్) కోసం పోరాటం చేస్తున్న వారి హక్కులను కాలరాస్తూ అటవీ సంపదను మోడీ ప్రభుత్వం కార్పోరేట్లకు దోచిపెడుతోందన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన ద్రౌపది ముర్ము ఒక్కసారి ఏపీ సహా ఇతర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో భిన్న దృక్ఫధాలు కలిగిన 17 ప్రతిపక్ష పార్టీలు ఒకేతాటిపైకొచ్చి కేంద్ర మాజీమంత్రి, ఐఎఎస్ అధికారి యశ్వంత్ సిన్హా పేరును ఏకగ్రీవంగా ప్రతిపాదించడం కీలక రాజకీయ పరిణామంగా ఆయన తెలిపారు.
2024 ఎన్నికల్లో బీజేపీ ఓటమి లక్ష్యంగా ప్రతిపక్షాల ఐక్యపోరాటాలకు ఇదో నిదర్శనం కాబోతోందని చెప్పారు. నరేంద్ర మోడీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రభావం అన్ని రాష్ట్రాలపై పడిందని ఆయన తెలిపారు. నాటి హిట్లర్ ప్రభుత్వ పాలనకు, నేటి మోడీ ప్రభుత్వ పాలనకు సారూప్యత ఉందని ఆయన ఆరోపించారు. అగ్నిపథ్ పథకంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం రక్షణశాఖపై సవివరణమైన చర్చలు జరపకుండా ఏకపక్షంగా అనాలోచిత నిర్ణయం తీసుకుందని విమర్శించారు. గతంలో మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, వ్యవసాయ నల్ల చట్టాలు సరైనవేనని సమర్థించుకోగా, ప్రజలు తప్పని చెప్పారన్నారు.
ఆచరణలో కూడా అదే రుజువైందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తూ మోడీ క్షమాపణ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ అగ్నిపథ్ పథకంపై కూడా వెనక్కి తగ్గక తప్పదన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ అధ్యక్షులు చావా రవి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి ఆర్ . వసంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బినయ్ విశ్వంకు నిర్వహకులు చిరుసత్కారం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.