రాహుల్ పై బీజేపీ వ్యాఖ్యలు నిరసిస్తూ ధర్నా
దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ మాది
మీది మతతత్వ పార్టీ అంటూ ఫైర్
వాస్తవాలు మాట్లాడితే మా నేతలను ఉగ్రవాది అంటారా
బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే
విజయవాడ – కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద టెర్రరిస్టు అంటూ బీజేపీ, శివసేన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఇవాళ వన్‌టౌన్‌లో కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిల ఆధ్వర్యంలో ధర్నాకు దిగింది. మోడీ కేడీ, కిలాడి అంటూ నినాదాలు చేశారు. ఇందులో పాల్గొన్న నేత నోరు పారేసుకున్న నేతలపై అనర్హత వేటు వేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ వాస్తవాలు మాట్లాడితే తీవ్రవాదం అంటారా అని మండిపడ్డారు షర్మిల.
ఆయన అడిగిన అంశాలపై సమాధానాలు చెప్పే ధైర్యం ఉందా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అదే తీవ్రవాదులకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలయ్యారన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని అంటూ ఆ పార్టీ నేతలు మత మంటలు రేపి అందులో చలి కాచుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముస్లింలు, దళితులకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణాలకే అన్ని కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. అట్టడుగు వర్గాల వారి కోసం బీజేపీ ఎప్పుడైనా పనిచేసిందా అని ప్రశ్నించారు. ప్రధాన పోస్టుల్లో ఎంతమంది ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్ల పాలనలో దళితులపై 35శాతం దాడులు జరిగాయన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారన్నారు.
బీజేపీ దారుణాలను ఎత్తిచూపి ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. నేడు రాహుల్ గాంధీకే బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్‌పై నోరుపారేసుకున్న నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మస్తాన్ వలీ, జేడీ శీలం, నరహరశెట్టి నరసింహారావు, కొలనుకొండ శివాజి, తదితరులు పాల్గొన్నారు.