Wednesday, November 20, 2024

TG: ప్రపంచ దేశాలకు భార‌త్ ను బాస్ గా నిలిపిన ఘనత మోడీ దే.. టీజీ వెంక‌టేష్‌

(కర్నూలు బ్యూరో) : ప్రపంచ దేశాలకు భారతదేశన్ని బాస్ గా నిలిపిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కిందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఒకప్పుడు ప్రపంచాన్ని ఐదు, ఆరు దేశాలు శాసించేవని, కానీ దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించాక ఆదేశాలకు కూడా మన దేశాన్ని బాస్ గా నిలిపిన ఘనత ఆయనకే దక్కిందని వివరించారు. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ప్రపంచంలో మనదేశ గౌరవాన్ని తగ్గించేలా పరిపాలించాయని, కానీ బిజెపి ప్రభుత్వం మాత్రం మన దేశ గౌరవాన్ని పెంచే విధంగా ముందుకు సాగుతుందని చెప్పారు. గత తొమ్మిది సంవత్సరాల బిజెపి ప్రభుత్వ హయాంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు. కేవలం ఎన్నికల్లో ప్రయోజనాల కోసమే బిజెపి ప్రభుత్వాన్ని కమ్యూనల్ గా చూపించే ప్రయత్నం అనేక పార్టీలు చేస్తున్నాయని, అది సమంజసం కాదని చెప్పారు. దేశంలో మైనార్టీలకు రాజ్యాంగ ప్రకారం హక్కులు ఉన్నాయని, కానీ మెజార్టీ వర్గాలలో కూడా పేదలున్నారని, వారిని కూడా ముందుకు తీసుకువెళ్లే దిశగా బిజెపి ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు. మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ప్రయత్నం బిజెపి ప్రభుత్వం చేస్తుందని, దీనిని కొన్ని పార్టీలు తమ స్వార్థం కోసం కమ్యూనల్ గా ముద్ర వేస్తున్నాయని చెప్పారు. దేశంలో పేదరిక నిర్మూలనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. మన రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే నిధులను ఎక్కువగా కేటాయిస్తుందని, అయితే వీటిని వినియోగించుకోవడంలో ప్రభుత్వం విఫలం చెందిందని చెప్పారు.

కేంద్రం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించడం ద్వారా దుర్వినియోగం చేస్తున్నట్లు వివరించారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఇచ్చే కంటే 25 శాతం అదనంగా గృహ నిర్మాణ పథకాన్ని మన రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిందని వివరించారు. దేశంలో 27 కోట్ల మహిళలకు రుణాలను అందజేసిందని చెప్పారు .అలాగే యువశక్తి పథకం ద్వారా యువత అభివృద్ధికి అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందని చెప్పారు. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తుందని చెప్పారు. కర్నూలు నగరంలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి రూ.90 కోట్ల రుణాలను బ్యాంకులో డిపాజిట్ చేసినప్పటికీ వాటిని ఖర్చు చేసి హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయడంలో విఫలం చెందారని చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి అనువైన వాతావరణం లేకపోవడం వల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని, ఇందులో భాగంగానే రసాయనిక ఎరువులకు సంబంధించి భారీగా సబ్సిడీలు ఇస్తుందని చెప్పారు. దేశంలో రైతులకు సంభందించి కోటీ 33 లక్షల క్లైమ్ ల‌ను పరిష్కరించిందని చెప్పారు. ఒకప్పుడు వ్యాక్సిన్లను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండేదని, కానీ కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు ఊహించని విధంగా మన దేశంలో వ్యాక్సిన్ తయారు చేయించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కిందని చెప్పారు. మన దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందజేయడమే కాకుండా అవసరమైన దేశాల్లో కూడా వ్యాక్సిన్ సరఫరా చేసి అన్ని దేశాల మన్నన‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందుకున్నారన్నారు. మన దేశంలో సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలున్న వారు ఉన్నారని, అలాంటి వారు ఇతర దేశాల్లో కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారం వల్లే ఆరు శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా ఆయా శాఖల అభివృద్ధికి సమర్ధవంతంగా కృషి చేశానని చెప్పారు. ఇందుకు సంబంధించి బెస్ట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా అవార్డు అందుకున్న విషయాన్ని ఆయన వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార‌థ్యంలో భవిష్యత్తులో మన దేశం మరెన్నో అద్భుతాలను సృష్టించ బోతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో బిజెపి నాయకులు డాక్టర్ వినుషారెడ్డి, పోలంకి రామస్వామి, కాశీ విశ్వనాథ్, కాలంగి నరసింహ వర్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement