Friday, November 22, 2024

AP | దోమల నివారణకు ఆధునిక టెక్నాలజీ..

(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : రోజురోజుకీ విజృంభిస్తున్న దోమల నివారణ కోసం అధికారులు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు ఫాగింగ్ యంత్రాల ద్వారా దోమల నివారణ కోసం ప్రయత్నిస్తుండగా, తాజాగా దోమల విజృంభనకు అతి ముఖ్యమైన లార్వా నిర్మూలన కోసం సరికొత్త ప్రయోగానికి స్వీకారం చుట్టారు.

లార్వా అత్యధికంగా పుట్టుకొచ్చే ప్రాంతాలలో డోన్ల సహాయంతో గుర్తించడమే కాకుండా, కెమికల్స్ స్ప్రేయింగ్ చేసే విధానాన్ని తీసుకువచ్చారు. ముఖ్యంగా నది పరివాహక ప్రాంతాలు,మురుగు కాలువల వెంబడి లార్వా అధిక స్థాయిలో ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోనే తొలిసారిగా విజయవాడలో డ్రోన్స్ సహాయంతో యాంటీ లార్వా ఆపరేషన్ పనులకు శ్రీకారం చుట్టారు.

మురుగు కాలువల్లో దోమలు పెట్టే లార్వాను డ్రోన్స్ సహాయంతో గుర్తించి, వాటిని నివారించేందుకు డోన్స్ ద్వారానే కెమికల్స్ స్ప్రేయింగ్ చేసే విధానాన్ని శుక్రవారం విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాద్, సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు తో కలిసి ప్రారంభించారు.

విజయవాడలోని సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న అయోధ్య నగర్ లోని బుడమేరు వంతెన దగ్గర డ్రోన్స్ సహాయంతో యాంటీ లార్వా ఆపరేషన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కేసినేని శివనాధ్ మాట్లాడుతూ ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రజల ఆరోగ్యానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో దోమల నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా మలేరియాతో పాటు సీజనల్ జ్వరాలు తగ్గుముఖం పట్టాయి అన్నారు.

దోమల నివారణ కారణంగా మలేరియాతోపాటు, వైరల్ జ్వరాలు విజృంభించకుండా రాష్ట్ర ప్రభుత్వం గత రెండు నెలల నుండి కట్టుదిట్టమైన ప్రణాళిక ద్వారా దోమల నివారణ చర్యలు చేపట్టిందన్నారు. డ్రోన్స్ సహాయంతో లార్వా ఉన్న ప్రదేశాలను గుర్తించి, వాటి ద్వారానే కెమికల్ స్ప్రేయింగ్ చేస్తున్న విధానంతో దోమల నిర్మూలన కోసం సత్ఫలితాలను ఇస్తుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement