Tuesday, November 26, 2024

ఆధునిక సారథి..ముత్తా వారధి

కాకినాడకే మణిహారంగా ఫ్లైఓవర్‌
వంతెనకు ముత్తా గోపాలకష్ణ వారధిగా నామకరణం
కార్పొరేషన్‌ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం
నేడు ముఖ్యమంత్రి జగన్‌ చేతుల మీదుగా ప్రారంభం

కాకినాడ, ఆంధ్రప్రభ ప్రతినిధి: కాకినాడ మునిసిపల్‌ కార్పొరేష న్‌లో రామారావుపేట నుంచి కొండయ్యపాలెం మీదుగా కొత్తగా నిర్మించిన పైవంతెన నగరానికే మణిహారంగా నిలిచింది. ఈ వంతెనకు ముత్తా గోపాలకృష్ణ వారధిగా నామకరణం చేస్తూ కార్పోరేషన్‌ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

స్మార్ట్‌ సిటీ రూపకల్పనలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ విశేష కృషి చేశారని పార్టీలకతీతంగా నేతలు కొనియాడారు. శాసన సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి కాకినాడ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిం చారు. అన్ని రాజకీయ పార్టీల నేతలతో సత్సంబంధాలు నెరుపు తూ కాకినాడ నగరాభివృద్ధిని కొనసాగించారు. పెరుగుతున్న జనాభాకనుగుణంగా నగరం విస్తరణ, మౌలిక వసతులు కల్పిస్తూ ప్రజలకు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్లు ఏర్పాటు చేశారు. నేడు ఆంధ్రప్రదేశ్‌లో మోడల్‌ నగరంగా రూపుదిద్దు కుంది. ఈ ఘనత ముత్తా గోపాలకృష్ణకే దక్కుతుంది. నేడు సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభించనున్న రామారావుపేట నుండి కొండయ్యపాలెం రైల్వే గేటు మీదుగా నిర్మించిన ఈ వంతెనకు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ పేరిట నామకరణం చేశారు.

- Advertisement -

ఆయన నాలుగు దఫాలు కాకినాడకు ఎమ్మెల్యేగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా, వివిధ కార్పొరేషన్ల చైర్మన్‌గా సేవలందించారు. అన్నింటికి మించి ఆధునిక నగర నిర్మాతగా పేరుగాంచారు. కాకినాడ నగరానికి అభివృద్ధి ప్రదాతగా నిల్చారు. రానున్న ఐదారు దశాబ్దాల నగర అవసరాల్ని దృష్టిలో పెట్టుకుని అప్పట్లోనే పెద్దఎత్తున గృహ నిర్మాణం, రహదార్ల విస్తరణ, ఉద్యానవనాల నిర్మాణం చేపట్టారు. ఆయన హయాంలో 35వేల మందికి పైగా సొంతిళ్ళదారుల య్యారు. 80వ దశకంలోనే ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని సమీకరించి ముందుగానే లేఅవుట్లు పూర్తి చేసి 80 నుంచి 100 అడుగుల రోడ్లేసి ఇరువైపులా డ్రైన్లు, విద్యుత్‌, మంచినీటి సదుపాయాలను కల్పించిన తర్వాతే పేదలకు ఇళ్ళ స్థలాలిచ్చారు. అప్పుడే పక్కా భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించారు.

ఒకప్పుడు ఊరి చివర ఏర్పడ్డ కాలనీలు ఇప్పుడు నగరానికే మకుటాయమానంగా మారాయి. వీటి చుట్టూ నగరం విస్తరించింది. అప్పట్లో ఆయనిచ్చిన ఇళ్ళు ఇప్పు డు ఒక్కోటి రూ.50 నుంచి 80లక్షలకు పైగా ధర పలుకుతున్నా యి. ఇంటి యజమానులు కావడంతో పేదలకు సామాజిక హోదా, భద్రతలు లభించాయి. అలాగే, నగరంలో అనేక మురికి కూపాల్ని ఆయన సంస్కరించారు. వాటిని పరిశుభ్రపర్చి అక్కడే ఆహ్లాదకరమైన పార్కులు నిర్మించారు. కాకినాడలో జన్మభూమి పార్క్‌ ఇలా ఆవిర్భవించింది. ఒకప్పుడు అసాంఘిక శక్తులకు నిలయంగా ఉన్న రాజాట్యాంక్‌ను పరిశుభ్రంగా మార్చి నగరంలో అతిపెద్ద విహార కేంద్రంగా తీర్చిదిద్దారు. పారిశుద్ధ్య లోపంతో కునారిల్లుతున్న బోట్‌క్లబ్‌, పిండాల చెరువు, అన్నమ్మ చెరువుల్ని పూర్తిగా పరిశుభ్రం చేసి ఇన్‌లెట్‌, అవుట్‌లెట్‌లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాటిని మంచినీటితొనింపి చుట్టూ వాకింగ్‌ ట్రాక్‌ల ను నిర్మించి నగరానికే సుందర ప్రదేశాలుగా, పర్యా టక కేంద్రా లుగా మార్చేశారు. బాలాత్రి పురసుందరిఅమ్మవారి ఆలయాన్ని విజయవాడ అమ్మ వారి ఆలయం తర్వాత అంతటి స్థాయిలో ప్రసిద్ధి చెందెలా భక్తుల విరాళాలతో అభివృద్ధి చేశారు. ఒక్క ముక్కలో చెప్పా లంటే కాకినాడ నగర చరిత్రను వివరించాలంటేముత్తా గోపాలకృష్ణ రాజకీయాల్లోకి రాక ముందు.. రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత అన్నవిధంగా వర్గీకరించొచ్చు. ఆయన నగరానికి చేసిన సేవల్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పేరు చిరస్థాయిగా నిల్చేలా ‘శ్రీ ముత్తా గోపాలకృష్ణ వారధి’గా నామకరణం చేశారు.
ముత్తా దూరదృష్టి
కాకినాడలో మెయిన్‌ రోడ్‌ మీదుగా మాత్రమే రైల్వే ఓవర్‌ బ్రిడ్జి ఉండేది. సినిమా రోడ్‌, సాంబమూర్తినగర్‌, కొండయ్యపాలెం, అచ్యుతాపురం రైల్వేగేట్ల వద్ద వాహనాలు గంటల పాటు పడిగాపులు కాసే పరిస్థితి ఉండేది. రాన్రాను పోర్టు విస్తరణ జరగడంతో 2004నాటికి ట్రాఫిక్‌ అనూహ్యంగా పెరిగింది. అటు రైళ్ళు, ఇటు సాధారణ వాహనాల ట్రాఫిక్‌తో రైల్వేగేట్ల వద్ద గంటలకొద్దీ సమయం అనవసరంగా గడిచిపోయేది. ఇది వేలాది కుటుంబాల ఉత్పాదకతపై తీవ్ర ప్రభావం చూపింది. విద్యార్థులు పాఠశాలలకు, ఉద్యోగులు కార్యాలయాలకు సకాలంలో వెళ్ళలేకపోయేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముందు మూడు రైల్వే ఫ్లైఓవర్ల కోసం ముత్తా గోపాలకృష్ణ ప్రతిపాదనలు పెట్టారు.
భవిష్యత్‌ అవసరాలను సీఎంకు వివరించారు.

దీంతో ఈ మూడింటికి వైఎస్‌ ఆమోదముద్ర వేశారు. ఈ మూడింటికి ముత్తా ఎమ్మెల్యేగా ఉండగానే శంకుస్థాపన జరిగింది. ఆయన తర్వాత ఎమ్మెల్యే అయిన ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వీటి నిర్మాణ పనుల్ని పరుగులు దీయించారు. సినిమారోడ్‌ ఫ్లైఓవర్‌కు అప్పటికే గతించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు పెట్టారు. అనంతరం సాంబమూర్తినగర్‌ ఫ్లైఓవర్‌కు కాకినాడ మాజీ ఎంపీ, కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి దివంగత మల్లిపూడి శ్రీరామ సంజీవరావు పేరెట్టారు.కాగా మూడో వంతెన ఇప్పటికి పూర్తయింది. ఇది మిగిలిన రెండింటికంటే చాలా పొడ వెంది. పైగా ఇది అందుబాటులోకొస్తే నగరంలోని సినిమా రోడ్‌, మెయిన్‌రోడ్‌లపై వాహనాల రద్దీ పూర్తిగా తగ్గుతుంది. జాతీయ రహదారి పైనుంచి వచ్చే వాహనాలు నగరంలోని మెయిన్‌రోడ్‌, టూ టౌన్‌, భానుగుండి సెంటర్లతో సంబంధం లేకుండా నేరుగా నగరం దాటి వెళ్ళిపోతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement