ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆహార భద్రత ప్రమాణాలను మరింతగా పెంచేందుకు భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థతో ప్రభుత్వం మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ చొరవతో రాష్ట్రంలో ఆహార భద్రత ప్రమాణాలను బలోపేతం చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందుకు వచ్చింది. ఇందుకు పూర్తి సహకారం అందిస్తామని ఎఫ్ఎస్ఎస్ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జి.కమలవర్ధనరావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ప్రధానంగా ఏపీలో ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీలను ఏర్పాటు చేసేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సుముఖత వ్యక్తం చేసింది. తిరుమలలో, కర్నూలులో ఇంటిగ్రేటెడ్ ఫుడ్ ల్యాబ్స్ ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. అలాగే ఏలూరు, ఒంగోలులో బేసిక్ ఫుడ్ టెస్టింగ్ లేబొరేటరీలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 5 ప్రాథమిక ప్రయోగ కేంద్రాలు, 15 మొబైల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ల్యాబ్లో రూ.21 కోట్లతో మౌలిక వసతుల ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.
ఈమేరకు మంత్రి సత్యకుమార్ యాదవ్ సమక్షంలో ఎఫ్ఎస్ఎస్ఎఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి జి.కమలవర్ధనరావు, ఏపీ ఆహార భద్రత కమిషనర్ సి.హరికిరణ్, ఎఫ్ఎస్ఎస్ఎఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇనోషి శర్మ ఒప్పందంపై సంతకాలు చేశారు.