విశాఖపట్నం, (ప్రభన్యూస్ బ్యూరో) : విశాఖజిల్లాలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నిన్న అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులు వంశీకృష్ణశ్రీనివాస్ యాదవ్, వరుదుకళ్యాణిలు తమ నామినేషన్లను అట్టహాసంగా దాఖలు చేశారు. అంతకు ముందు పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్ధులతో పాటు రాజ్యసభ సభ్యులు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి వెంకట సత్యవతి, పలువురు శాసనసభ్యులు, పార్టీ కేడర్‌తో పాటు భారీ ర్యాలీగా వచ్చారు. పార్కు హోటల్ ఎదురుగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి, దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వీరంతా ఘన నివాళలర్పించారు.
ఈ సందర్భంగా రెండు ప్రాంతాల్లో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసే ప్రతీ ఒక్కరికి సముచిత స్థానం లభిస్తుందన్నారు. వీరిద్దరు అభ్యర్ధులు ప్రారంభం నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేశారని అందువల్లే వారి కష్టాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గుర్తించి గౌరవమైన స్థానం కల్పించారన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ , మైనారిటీ వర్గాలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడకు వలస వచ్చిన మైనారిటీలు సైతం తగిన గుర్తింపు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు , వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్‌లు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital