ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఎపి, తెలంగాణలో ఆరు స్థానాలకు ఎన్నికలు
నాలుగు ఉపాధ్యాయ, రెండు పట్టభద్రుల స్థానాలకు ఎలక్షన్
నేటి నుంచే ఎన్నికల కోడ్ అమలు
ఫిబ్రవరి మూడో తేదిన నోటిపికేషన్
ఫిబ్రవరి 27న పోలింగ్ .. మార్చి మూడు ఓట్ల లెక్కింపు
అమరావతి / హైదరాబాద్ : ఎపి, తెలంగాణలో పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫిబ్రవరి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. కాగా ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను వెల్లడించనున్నారు.
నేటి నుంచే ఎన్నికల కోడ్ ..
తెలంగాణ, ఎపిలోని నాలుగు ఉపాధ్యాయ, రెండు పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణాలో వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి, మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు
ఇది ఇలా ఉంటే మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి ప్రస్తుతం జీవన్ రెడ్డి(కాంగ్రెస్) , మెదక్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – కరీంనగర్ టీచర్ స్థానం నుంచి కూర రఘోత్తం రెడ్డి, వరంగల్ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ స్థానం నుంచి అలుగుబెల్లి నర్సి రెడ్డి కొనసాగుతున్నారు. ఈ ముగ్గురి పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. దీంతో ఈ మూడు స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు..
ఎపిలో
అటు ఏపీలో ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉపాధ్యాయ నియోజక వర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది.
ఎన్నికల షెడ్యూల్ ఇలా..
నోటిఫికేషన్ విడుదల – ఫిబ్రవరి 3
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ – ఫిబ్రవరి 10
నామినేషన్ల పరిశీలన – ఫిబ్రవరి 11
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ – ఫిబ్రవరి 13
పోలింగ్ – ఫిబ్రవరి 27(ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు)
ఓట్ల లెక్కింపు – మార్చి 3