Wednesday, September 18, 2024

AP | వచ్చే ఏడాది ఎమ్మెల్సీ ఎన్నికలు… ఓట్ల నమోదుకు షెడ్యూల్ విడుదల

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి మూడు నెలలు గడిసింది. ఇపుడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. 2025 మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించనున్నారు. కృష్ణా – గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు నమోదు చేసుకోవడానికి అధికారులు షెడ్యూల్‌ను విడుదల చేశారు.

ఓటు హక్కు నమోదుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ నెల 30 నుంచి నవంబర్‌ 6 వరకు ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. పాత ఓటరు లిస్టును పరిగణనలోకి తీసుకోరు. కొత్తగా ఓటు హక్కుకు అర్హులైన వారితో పాటు గతంలో ఓటు హక్కు ఉన్నవారు కూడా మరలా కొత్తగా ఓటు హక్కును పొందాల్సి ఉందని అధికారులు సూచించారు.

ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ద్వారా ఓటు హక్కును నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నిలకు ఫారమ్‌ 18లో, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఫారమ్‌ 19లో ఓటు హక్కును పొందాల్సి ఉంది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఎన్నికలు జరిగే నియోజకవర్గాల పరిధిలో నివసించే వారంతా గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఓటరు నమోదకు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ప్రొవిజినల్‌ లేదా అటెస్టెడ్‌ జిరాక్స్‌ కాఫీ తప్పనిసరి. వీటితో పాటు ఫొటో ఆధార్‌, ఓటర్‌ ఐడీ లేదా రెసిడెన్స్‌ ప్రూఫ్‌ను సమర్పించాల్సి ఉంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగు నియోజకవర్గాలలో ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సెకండరీ పాఠశాల ఆపై ఇనిస్టిట్యూషన్‌లో పనిచేస్తూ ఉండాలన్నారు.

అసెంబ్లి ఎన్నికలలో ఓటు హక్కు లేకపోయినా అర్హత కలిగి ఉంటే ఈ ఎన్నికలలో ఓటరుగా నమోదు కావచ్చని సూచించారు. ఆన్‌లైన్‌ ద్వారా లేదా స్థానిక తహశీల్దారు కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలన్నారు. ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని టీచర్లు, గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా ఫారమ్‌ 18, 19 ద్వారా ఓటరుగా నమోదు కావాలని అధికారులు కోరారు.

- Advertisement -

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏపీటీఎఫ్‌ అభ్యర్థిగా పాలకలపాటి రఘువర్మ

2025 ఫిబ్రవరి, మార్చి నెలలో జరగనున్న శాసనమండలి ఎన్నికలలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఏపీటీయఫ్‌ అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ పోటీ చేయనున్నట్లు ఆ సంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల, కె.భానుమూర్తి ప్రకటించారు.

శనివారం విజయవాడలో రాష్ట్ర కార్యాలయం చెన్నుపాటి సింగరాజు భవన్‌లో రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి మంజుల అధ్యక్షతన జరిగిన సబ్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అంతకుముందు నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆరు జిల్లాలలో జరిగిన అభిప్రాయ సేకరణలో ఆరు జిల్లాలు ఏకగ్రీవంగా పాకలపాటి రఘువర్మ పేరును ప్రతిపాదించినట్లు తెలిపారు.

ఆ ప్రతిపాదనను రాష్ట్ర సబ్‌కమిటీ పరిగణనలోకి తీసుకుని ఏకగ్రీవంగా రఘువర్మ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామన్నారు. గత ప్రభుత్వం హయాంలో విద్యారంగంలో జరిగిన సంక్షోభాలు, సమస్యల నివారణ జరగాలి అంటే ఏపిీటీయఫ్‌ అభ్యర్థి గెలుపు అనివార్యమని అందుకు రఘువర్మను అభ్యర్థిగా ప్రతిపాదిస్తున్నామని తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ పరిధిలో ఉండే ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు అందరూ రఘువర్మను రానున్న ఎన్నికలలో గెలిపించాలని కోరారు.

ఈ సబ్‌కమిటీ సమావేశంలో ఉపాధ్యక్షులు ఏ శ్యాంసుందర్‌ రెడ్డి, టి. త్రినాధ, కోనంకి అశోక్‌ కుమార్‌, పి.వెంకటేశ్వర్లు, మర్రివాడ అనిత, కార్యదర్శులు డి. సరస్వతి, బీఏ సాల్మన్‌ రాజు, సయ్యద్‌ చాంద్‌బాషా, ఈవీ రామారావు, కొటాన శ్రీనివాసు, ఎన్‌ రవికుమార్‌, ప్రత్యేక ఆహ్వానితులు పి. పాండురంగ వరప్రసాదరావు, ఉపాధ్యాయ ప్రధాన సంపాదకులు షేక్‌ జిలానీ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement