Thursday, November 21, 2024

MLA’s Survey Report – జ‌గ‌న్ చేతిలో ఎమ్మెల్యేల జాత‌కాలు….

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఈ నెల 21వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వర్క్‌షాప్‌ నిర్వహించబో తున్నారు. సుమారు 3 నెలల సుదీర్ఘ సమయం తర్వాత నిర్వహిస్తున్న వర్క్‌షాపులో సీఎం జగన్‌ పలు కీలకమైన అంశాలను చర్చించబోతు న్నారు. ఇప్పటికే గడిచిన మూడు నెలలకు సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు, నియో జకవర్గ ఇన్‌చార్జ్‌ ల పనితీరుపై అందిన సమగ్ర నివేదికలను సీఎం జగన్‌ పరిశీలిస్తున్నారు. మార్చి చివరి వారంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం వర్క్‌షాప్‌లో ఎంత మంది ఎమ్మెల్యేలు గ్రాఫ్‌ పెంచుకున్నారో..ఎంత మంది ప్రజాధరణకు దూరంగా ఉన్నారో సీఎం జగన్‌ సమీక్షలో భాగంగా వారి పేర్లను వెల్లడించారు. వచ్చే సమావేశంలోపు వారంతా తమ గ్రాఫ్‌ను పెంచుకోవాలని, అప్పటికీ మార్పు రాకపోతే ఇక మార్పులు తప్పవన్న సంకేతాలను సీఎం జగన్‌ గత వర్క్‌షాపులోనే స్పష్టంగా చెప్పారు.

దీంతో ఈ నెల 21వ తేదీన జరిగే వర్క్‌షాప్‌లో సీఎం జగన్‌ వెనుకబడిన మంత్రులు, ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. గత రెండు రోజుల క్రితమే రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాలకు సంబంధించిన సమగ్ర సర్వే నివేదికలు సీఎం చేతికి చేరాయి. వాటిని ఆయన పరిశీలిస్తున్నారు. సమావేశంలోపు నివేదికలను సమగ్రంగా పరిశీలించి ఆయన ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మే 11వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సీఎం జగన్‌ శ్రీకారం చుట్టారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను నెలలో కనీసం 16 నుంచి 21 రోజులు ప్రజల్లోనే ఉండాలని సూచించారు. ఆ దిశగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రతిఒక్కరు ఉపయోగించుకుని ప్రజలకు మరింత చేరువ కావాలని చెప్పారు. అందులో భాగంగా దాదాపుగా 80 శాతం మంది శాసనసభ్యులు సీఎం జగన్‌ ఆశయాలకు అనుగుణంగా, లక్ష్యాలకు దగ్గరగా నిత్యం ప్రజల్లో ఉంటూ తమ గ్రాఫ్‌ను పెంచుకుంటూ వస్తున్నారు. 20 శాతం మందిలో మాత్రం మార్పు కనిపించడం లేదు. బహుశా అటువంటి వారి విషయంలో వచ్చే వర్క్‌షాప్‌లో సీఎం జగన్‌ సీరియస్‌ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

175 నియోజకవర్గాలపై.. తాజా సర్వే
ఎన్నికల సమయం దగ్గర పడుతున్నకొద్దీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 175 నియోజకవర్గాలపై ఫోకస్‌ పెంచుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ ల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాజాగా ఈ నెల 21వ తేదీ గడప గడపకు మన ప్రభుత్వంపై వర్క్‌షాప్‌ నిర్వహించబోతున్న నేపధ్యంలో గడిచిన మూడు నెలలుగా ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎన్నిరోజులు పర్యటించారు. ప్రజలతో ఎంత సేపు మాట్లాడారు..ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలపై ఏవిధంగా ప్రచారం చేస్తున్నారు..ప్రజలకు ఏ తరహాలో అవగాహన కల్పిస్తున్నారు..ఇలా అన్ని కోణాల్లో వారి పనితీరును ఆరా తీస్తూ ఆ దిశగా తాజా సర్వే నివేదికలను సీఎం జగన్‌ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి తెలుగుదేశం శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్‌చార్జ్‌ లను నియమించింది. అలాగే ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్‌ చేసిన నలుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాలకు కూడా సీఎం జగన్‌ ఇన్‌చార్జ్‌ లను నియమించారు. ఒక్క ఉదయగిరికి మాత్రమే పరిశీలకులుగా మెట్టుకూరు ధనుంజయరెడ్డిని నియమించారు. ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌ ను నియమించాల్సి ఉంది. అయితే మిగిలిన నియోజకవర్గాల్లో ఇన్‌చార్జ్‌ ల పనితీరు ఎలా ఉంది. గడిచిన మూడు నెలలుగా వారు ప్రభుత్వ పథకాలను ఎలా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు..పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారా..లేదా ఇలా వారి పనితీరుపై కూడా ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. మొత్తం మీద 175 నియోజకవర్గాలకు సంబంధించి క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుందో సీఎం జగన్‌ తెలుసుకోవడంతో పాటు అందుకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని తెప్పించుకుని పరిశీలిస్తున్నారు.

- Advertisement -

కఠిన నిర్ణయాలు తీసుకునే యోచన
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చాలా మంది శాసనసభ్యులు సీఎం జగన్‌ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా ప్రజలతో కలిసి అడుగులు వేయలేకపోతున్నారు. కనీసం నియోజకవర్గంలో వారం రోజులు కూడా పర్యటించలేక పోతున్నారు. కొంత మంది అయితే అసలు నియోజకవర్గాల్లో మొక్కుబడిగా అలా వెళ్లి..ఇలా వచ్చేస్తున్నారు. పలువురు మంత్రులు కూడా ఆశించిన స్థాయిలో ఆయా జిల్లాలపై పట్టు సాధించలేకపోతున్నారు. అటువంటి వారి విషయంలో సీఎం జగన్‌ కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత వర్క్‌షాప్‌లో సీఎం జగన్‌ చాలా స్పష్టంగా సభ్యులకు చెప్పారు. గెలుపు గుర్రాలకే అవకాశమిస్తామని, ఎవరినీ దూరం చేసుకోవడం తనకిష్టం లేదని, ఇక్కడ ఉన్న వారంతా గెలిచి తనతో పాటు అసెంబ్లిdలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నానని, ఆ దిశగానే అందరూ తమ పనితీరును మెరుగుపరుచుకుని ప్రజా ఆదరణను పొందాలని స్పష్టంగా చెప్పారు. అయినా కొంతమందిలో మార్పు కనిపించడం లేదు. అటువంటి వారి విషయంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ నెల 23 నుండి..జగనన్న సురక్ష
ఈ నెల 23 నుండి వచ్చే నెల 23 వరకు నెలరోజుల పాటు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 9 రకాల సేవలను ప్రజలకు అందించే క్రమంలో పెద్దఎత్తున ప్రచారం చేయాలని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అందుకోసం ఈ కార్యక్రమాన్ని పక్కా ప్రణాళికతో నిర్వహించేందుకు సీఎం జగన్‌ వర్క్‌షాపులో భాగంగా జగనన్న సురక్షపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇవ్వబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement