ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ రేట్లపై రగడ కొనసాగుతోంది. సినిమా టికెట్ రేట్స్ తగ్గించడంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ఏపీ ప్రభుత్వపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఇటు ప్రభుత్వానికి, అటు సినీ పరిశ్రమకు గ్యాప్ ఏర్పడింది. సినిమా టికెట్ల రేట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వంపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నాని చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు సైతం కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, నటి రోజా కూడా ఈ విషయంపై స్పందించారు.
సీఎం జగన్ ఏం చేసినా కూడా అది పేదలకు మంచి జరిగేలా ఉంటుందని అన్నారు. సినిమా టికెట్ల వ్యవహారంలో కేవలం పెద్ద సినిమాల గురించే కొందరు ఆలోచిస్తున్నారన్న రోజా.. చిన్న సినిమాల గురించి అసలు పట్టించుకోవడం లేదన్నారు. అన్ని సినిమాలకు ఒకేరేటు అంటే చిన్న సినిమాలు బతకలేవని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై ఒక కమిటీ వేసిందని తెలిపారు. ఆ కమిటీ అన్ని విషయాలను పరిష్కరిస్తుందని రోజా చెప్పారు. ప్రభుత్వానికి, సినీ పరిశ్రమకు ఎలాంటి గ్యాప్ లేని స్పష్టం చేశారు. టికెట్ ధరలపై ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందన్నారు. పేద, మద్యతరగతి వాళ్లే థియేటర్లకు వస్తారని రోజా అన్నారు. టికెట్ రేట్లు ఫిక్స్డ్ గా ఉంటే సామాన్యులకు సినిమా చూసే అవకాశం ఉంటుందన్నారు. పెద్ద సినిమాల నిర్మాతలే టికెట్ల రేట్లపై అభ్యంతరం చెబుతున్నారని రోజా చెప్పారు.
సినిమా థియేటర్ల కంటే కిరాణా కొట్టు వ్యాపారం బాగా ఉందన్న హీరో నాని కామెంట్స్ పై రోజా ఘాటుగా స్పందించారు. సినిమా థియేటర్ల కంటే కిరాణా వ్యాపారం బాగా ఉందనే అభిప్రాయం ఉన్నప్పుడు, ఇక నానికి సినిమాలు ఎందుకు చేయటం వేస్టు..కిరాణా వ్యాపారమే చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. హీరో నాని చేసిన వాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యల వల్లే తెలుగు సినిమా పరిశ్రమ మరింత నష్టపోయే అవకాశం ఉంటుందని రోజా అభిప్రాయపడ్డారు. కొంత మంది రాజకీయ నేతలు తమ ఉనికి కోసం.. కొత్తగా పార్టీలు పెట్టిన వారే ఇలాంటి వివాదాలకు కారణమని రోజా పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..