ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో మునిసిపాలిటీలు, కార్పొరేషన్లలో పన్నులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పట్టణ ప్రాంతాల్లో ఇంటి పన్ను, నీటి పన్ను ఉండగా కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణ పేరుతో చెత్త సేకరణకు యూజర్ ఛార్జీ వసూలుకు శ్రీకారం చుట్టింది. దీనిపై ప్రతిపక్షాలు సర్కార్ పై విమర్శలులు గుప్పిస్తున్నాయి. అయితే, తాజాగా ఈ విషయంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పారిశుధ్యం పట్ల ప్రజల్లో బాధ్యత పెంపొందించడం కోసమే చెత్త మీద పన్ను విధించారని రోజా అన్నారు. పుత్తూరు మున్సిపాలిటీ 15వ వార్డులో జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఉచితం అయితే బాధ్యతగా ఉండరనే ఉద్దేశంతోనే రోజుకో రూపాయి వంతున చెత్త పన్ను విధించామని తెలిపారు. ఇందులో ప్రభుత్వం సంపాదించేదేమీ లేదన్నారు. అందరి ఇళ్లు, వీధి, ఊరు శుభ్రంగా ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం గురించి వాలంటీర్లు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని రోజా పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి: ఎయిడెడ్ విద్యాసంస్థలపై బలవంతం లేదు: సీఎం జగన్