Tuesday, November 19, 2024

జనసేన ఆవిర్భావ సభ..  రాపాకకు అందని ఆహ్వానం?!

జనసేన ఆవిర్భావ వేడుకల్లో భాగంగా నేడు గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని ఇప్పటంలో సభ ఏర్పాటు కానుంది. దీనికి శ్రీ దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నామకరణం చేశారు. సభకు రాష్ట్రం నలుమూలల నుంచి జనసేనికులు హాజరు కానున్నారు. అయితే, ఆపార్టీకి చెందిన ఏకైన ఎమ్మెల్యే రాపాకు మాత్రం ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.

అసెంబ్లీలో జనసేన పార్టీకి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న ఏకైక సభ్యుడుగా రాపాక వరప్రసాద్ ఉన్నారు. 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు. అయితే, గత కొంత కాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అధికార వైసీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారు. చాలా సందర్భాల్లో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించారు. అసెంబ్లీ సమావేశాల్లోనే కాకుండా బహిరంగ సభల్లోనూ వైఎస్ జగన్‌కు జైకొట్టారు. దీంతో ఆయన వ్యవహార శైలిపై పార్టీ నాయకులు సైతం చాలా సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వంపై జనసేన పోరాటం చేస్తుంటే.. ఆపార్టీకి చెందిన ఎమ్మెల్యేనే అధికార పార్టీకి మద్దుతుగా ఉండడం జనసైనికులకు రుచించడం లేదు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఆవిర్భావ సభకు హాజరు కావడానికి ఆయనకు ఆహ్వానం అందలేదని తెలుస్తోంది. దీనికి అనుగుణంగా- రాపాకకు ప్రవేశం లేదంటూ పోస్టర్లు, బ్యానర్లు సైతం వెలిశాయి. ఈ సభకు రాపాక రావాల్సిన అవసరం లేదంటూ రాజోలు నియోజకవర్గ జన సైనికులు ఈ బ్యానర్లను కట్టారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement