Saturday, November 23, 2024

AP : రూ. 3.36 కోట్లతో నిర్మించిన తారు రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 16(ప్రభన్యూస్) కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలం, ఆర్కే రోడ్డు దనియానిచెరువు నుండి కోటిరెడ్డిపల్లి మీదుగా గోకనపల్లి రోడ్డు వరకు రూ. 3.36 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన తారు రోడ్లను కదిరి శాసనసభ్యులు డాక్టర్ పి వి సిద్దా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో నేడు రూ. 3.36 కోట్ల రూపాయలతో అధునాతనమైన మన్నిక కలిగిన తారు రోడ్లను నిర్మించామన్నారు.

దశాబ్దాల కాలం నుండి ఏమాత్రం అభివృద్ధికి నోచుకోనటువంటి కదిరి నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు 135 గ్రామాలకు అప్రోచ్ రోడ్లను నాలుగు సంవత్సరాల కాలంలో వేసామన్నారు. ప్రజలకు అత్యవసరమైన సేవలను (108 & 104 వాహనాలను) అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో ఏ విధంగానైతే స్థానం సంపాదించుకున్నారో అదేవిధంగా వారి తనయుడిగా జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారన్నారు. వీటన్నిటిని చూసి ఓర్వలేని కొందరు దుష్టులు జగనన్న పై బురద చల్లే కార్యక్రమాలు చేస్తున్నారని, వాటిని పట్టించుకునే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అధికారం అడ్డం పెట్టుకొని ప్రజల సొమ్మును దోచుకున్నారని, ప్రజల నుండి దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తామన్నారు. జగనన్న చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి 2024లో ప్రజలే పట్టం కడతారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement