ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. అయితే, కొత్త మంత్రుల పేర్లు ఆదివారం రాత్రి 7 గంటలకు అధికారికంగా ప్రకటిస్తామని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఆశావహుల లిస్ట్ పెరుగుతోంది. చాలా మంది సజ్జలతో భేటీ అయ్యేందుకు ప్రయ్నతించారు. ఇప్పటికే మంత్రులు ఖరారు అయినట్లు పలువురి పేర్లు బయటకు రావడంతో ఆయా నేతల అనుచరులు స్వీట్లు పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే వైసీపీ సీనియర్ నాయకుడు, పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఈ సారి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. మంత్రి పదవి ఇవ్వకపోతే తామంతా రాజీనామాకు సిద్ధమని అక్కడి మున్సిపల్ కౌన్సిలర్లు తేల్చిచెప్పారు. మాచర్లలోని మున్సిపల్ కార్యాలయంలో వారంతా సమావేశమై ఈ మేరకు తీర్మానించారు. మాచర్లలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు కూడా సమావేశయ్యారు. పిన్నెల్లికి ఈసారి కేబినెట్‌లో అవకాశం ఇవ్వకపోతే మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తామని స్టేట్ మెంట్లు ఇచ్చారు.
కాగా, 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి.. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసి జగన్ వెంట నడిచారు. 2012 ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో సైతం విజయం సాధించారు. వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి.. సీఎం జగన్‌కు అత్యంత విధేయుడిగా పేరుంది.