Tuesday, November 26, 2024

మిర్చీ రేటు య‌మ‌ ఘాటు.. గుంటూరులో క్వింటాలుకు 18వేలు..

మిర్చి రేట్లు భారీగా పెరిగాయి. గుంటూరు యార్డుకు దాదాపు లక్ష టిక్కీల వరకు మిర్చి వచ్చింది. కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్న సరుకు ఎక్కువగా యార్డుకు వస్తోంది. వివిధ వెరైటీల గరిష్ట ధర సగటున క్వింటాలుకు రూ.18 వేలు పలకగా.. కనిష్ట ధర రూ.9 వేల వరకు వ‌చ్చింది. గతనెల కంటే ఈ నెలలో మిర్చీ రేట్ల పెరుగుదల ఎక్కువగా ఉంది. గతనెలలో నాన్ ఎసీ కామన్‌ వెరైటీ సగటు ధర కనిష్టంగా రూ.7 వేలు ఉండగా గరిష్టంగా రూ.12 వేల వరకు పలికింది. తాజాగా ఇదే వెరైటీ కనిష్ట ధర రూ.7 వేలు, గరిష్ట ధర రూ.16 వేలుగా ఉంది. 20 రోజుల క్రితం నాన్ ఎసీ స్పెషల్‌ వెరైటీల్లో క్వింటాలుకు కనిష్ట ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.14 వేలు వచ్చింది. ప్రస్తుతం కనిష్ట ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.18 వేల వరకు వచ్చింది.

ఇదే రీతిలో ఎసి కామన్‌ వెరైటటీలు గత నెలలో కనిష్ట ధర రూ.7 వేలు, గరిష్ట ధర రూ.13 వేలు పలికింది. ప్రస్తుతం ఇవే వెరైటీలు కనిష్ట ధర రూ.9300, గరిష్ట ధర రూ.17500 పలికాయి. ఎసి స్పెషల్‌ వెరైటీల్లో గతనెలలో కనిష్ట ధర రూ.9 వేలు గరిష్ట ధర రూ.14 వేలు రాగా ఈనెలలో ప్రస్తుతం కనిష్ట ధర రూ.7200, గరిష్ట ధర రూ.18 వేలు పలికింది. ప్రతి వెరైటీకి క్వింటాలుకు గరిష్టంగా రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉండే తేజ, బాడిగ వెరైటీలు రూ.18 వేలు దాటి కూడా పలికాయి.

కొంత సరుకు గరిష్టంగా క్వింటాలు రూ.20 వేల వరకు పలికినట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి. ఏటా డిసెంబరు 20 కల్లా కొత్త సరుకు మార్కెట్‌కు రావడం అనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సాగు ఆలస్యమవడం, తామర తెగులు వల్ల పైరు దాదాపు లక్ష ఎకరాల్లో దెబ్బతినడం వల్ల పంట రావడంలో కొంత జాప్యమవుతోంది. ఈ లోగా కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్న సరుకును యార్డుకు తీసుకువస్తున్నారు. కోల్డ్‌ స్టోరేజీల్లో ఇంకా పది లక్షల టిక్కీల వరకు ఉంటుందని, ఈ సరుకు ఈనెలాఖరు కల్లా విక్రయాలు పూర్తవుతాయని జనవరి మొదటి వారం నుంచి కొత్త సరుకు రావడం ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో మిర్చి సాధారణ విస్తీర్ణం 1.70 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది 2.65 లక్షల ఎకరాల్లో మిర్చిసాగు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement