ప్రభ న్యూస్ ఎన్టీఆర్ బ్యూర. – ప్రేమ పేరుతో మైనర్ బాలికను వేధిస్తున్న యువకుడిపై దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ బాలికకు అండగా ఉంటామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ సంఘటన ఎన్టీఆర్ జిల్లా అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…బాధిత మైనర్ బాలిక తల్లిదండ్రులతో కలిసి అజిత్ సింగ్ నగర్ లోని ఓ కాలనీ లో నివాసం వుంటోంది. నున్న కు చెందిన లల్లు అనే యువకుడు గత కొన్ని రోజులుగా మైనర్ బాలిక వెంటపడి వేధిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులకు విషయం తెలిసి లల్లు కు వార్నింగ్ కూడా ఇచ్చారు.
కొన్ని రోజులు బాగానే ఉన్న లల్లు మళ్ళీ బాలికను వేధించడం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో శనివారం రోజున ఒంటరిగా ఉన్న బాలిక పట్ల లల్లు అసభ్యంగా ప్రవర్తించాలని చూసాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. బాలిక తల్లిదండ్రులు బాధపడటం చూసి బంధువులు దిశ ఎస్ ఓ ఎస్ కు కాల్ చేసి సమాచారం అందించారు. దిశ యాప్ ద్వారా సమాచారం అందిన వెంటనే కేవలం ఎనిమిది నిముషాల వ్యవధిలో బాధితురాలి ఇంటికి పోలీసులు చేరుకున్నారు.
మైనర్ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు వివరాలను నమోదు చేశారు. లల్లు అనే యువకుడు తరుచూ బాలిక వెంటపడి వేధిస్తున్నట్లు మరికొంత మహిళలు కూడా పోలీసులకు తెలిపారు. మైనర్ బాలిక మరియు ఆమె తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లల్లు అనే యువకుడిపై ఐపీసీ సెక్షన్ 354 D, ఫోక్స్ యాక్ట్ 12 ప్రకారం అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దిశ యాప్ కు కాల్ చేసిన వెంటనే తక్షణం స్పందించిన పోలీసులకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. బాలికలు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని దిశ పోలీసులు హెచ్చరించారు.