Saturday, November 23, 2024

ఆర్య వైశ్యులపై చంద్రబాబుది కపట ప్రేమ

ఆర్యవైశ్యులపై టీడీపీ అధినేత చంద్రబాబు కపట ప్రేమ చూపుతున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే తోలు తీస్తాను అంటాడు.. ప్రతిపక్షంలో ఉంటే, అందరికీ తోడుగా, అండగా ఉంటాను అని స్టేట్ మెంట్లు ఇవ్వడం ఆయనకు పరిపాటి అని విమర్శించారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్న ఆర్య వైశ్యుడు మల్లికార్జునరావును పిలిపించి ఆయన భార్య శ్రీదేవికి మాచర్ల చైర్మన్ పదవి ఇచ్చినట్టే ఇచ్చి.. తన సామాజికవర్గం కోసం పదవికి రాజీనామా చేయమని ఒత్తిడి చేశారని ఆరోపించారు.

చిలకలూరిపేట లో శంకర్ అనే వ్యక్తిని మీ హయాంలో హత్య చేయించింది వాస్తవం కాదా..? అలానే, మంత్రిగా పనిచేసిన సిద్దా రాఘవరావును బలవంతంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించి, ఆయన ఓటమికి కారణం అయింది మీరు కాదా.. ? అని ప్రశ్నించారు. సినీ నటి కవితను ఏడిపించి బయటకు పంపలేదా..? అని అడిగారు. ఆర్యవైశ్యులను అడుగడుగునా చులకనగా చూసిందీ, అవమానించిందీ చంద్రబాబే అని మండిపడ్డారు. అమరజీవి పొట్టి శ్రీరాములుని అవమానిస్తూ, రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవనిర్మాణ దీక్షగా మార్చింది చంద్రబాబు కాదా ? అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాకే,  నవంబర్ 1ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించిందన్నారు. మాజీ సీఎం రోశయ్య వాసవి సత్రాలను ఆర్యవైశ్యులకు ఇస్తే వాటిని మీరు తీసుకోలేదా…? అని నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మరణిస్తే… మూడు రోజులు సంతాప దినాలుగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారని గుర్తు చేశారు.  ముగ్గురు మంత్రులను అంత్యక్రియలకు పంపారని, ఆయన ఆస్తికలు కలపడానికి కూడా మంత్రులను పంపారని మంత్రి వెల్లంపల్లి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement