Tuesday, November 26, 2024

రామతీర్థంలో రాజకీయం.. అశోక్ గజపతిరాజుపై మంత్రి వెల్లంపల్లి ఆగ్రహం

రామతీర్థం నీలాచలం బోడికొండపై ఆలయ ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు వ్యవహరించిన తీరుపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఆలయ ధర్మ కర్తకు ఇవ్వాల్సిన అన్ని మర్యదలు ఇచ్చామని అన్నారు. కానీ కొండపై అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారని మండిపడ్డారు. ప్రోటోకల్ ప్రకారమే శిలా ఫలకం పై పేర్లు రాయించామన్నారు. ప్రభుత్వాన్ని సర్కస్ కంపెనీ అని వ్యాఖ్యలు చేయడాన్ని ఖండించారు.

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఒక్క రూపాయి అయిన విరాళం ఇచ్చారా? అని మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. దేవాలయంకి చైర్మన్ గా ఉన్నపుడు ఆలయ అభివృద్ధికి ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు. రామతీర్థం ఆలయ నిర్మాణం అశోక్ గజపతి రాజుకి ఇష్టం లేదని, అందుకే అడుగడుగునా అడ్డుపడుతున్నారని మంత్రి ఆరోపించారు. రాముడి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఎట్టి పరిస్థితిల్లో వచ్చే శ్రీరామ నవమికి ఆలయ నిర్మాణం పూర్తవుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఒక చైర్మన్ గా ప్రభుత్వనికి ఎప్పుడైనా గుడి అభివృద్ధికి లేఖ రాశారా? అని ఆశోక్ గజపతి రాజుకు మంత్రి వెల్లంపల్లి అడిగారు. విలువలు కాపాడుకోకుండా వ్యవహారిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రామతీర్ధం ఆలయాలు అభివృద్ధి కోసం నాలుగు కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. కొండ పైన ఉన్న గుడికి 3 కోట్లు, కొండ దిగువ ఉన్న గుడికి కోటి రూపాయలు కేటాయించినట్లు వివరించారు. దురదృష్టవశాత్తు రాముడి విగ్రహం ధ్వంసానికి గురైందన్న మంత్రి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నో ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. వాటన్నిటిని కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి వెల్లంపల్లి హామీ ఇచ్చారు.

కాగా, విజయనగరం జిల్లాలోని రామతీర్థం బోడికొండ ఆలయ పున:నిర్మాణ పనుల కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం వివాదంగా మారింది. శంకుస్థాపన బోర్డుపై ఆలయ అనువంశిక ధర్మకర్త అయిన తనను విస్మరించడంపై అశోక్‌ గజపతిరాజు ఆవేదనకు లోనయ్యారు. అక్కడున్న శంకుస్థాపన బోర్డు తీసివేసేందుకు ప్రయత్నించారు. ప్రభుత్వ తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. సంస్కృతి, సంప్రదాయాలను అధికారపార్టీ పాటించలేదని, ధర్మకర్త చేయాల్సిన పనులు కూడా చేయనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement