ఎమ్మిగనూరు పట్టణంలోని బాలికల బీసీ సంక్షేమ హాస్టల్లో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జౌళి శాఖ మంత్రి సవిత ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలో గదులు, వంటగది, టాయిలెట్స్ ను తనిఖీ చేశారు. వంట గదిలో విద్యార్థుల కోసం తయారు చేసిన ఆహారాన్ని మంత్రి రుచి చూశారు.
అనంతరం విద్యార్థులతో మాట్లాడుతూ… వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం సదరు వసతి గృహంలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు ఉన్నందువలన గదులు సరిపోవటం లేదని, శాశ్వత ప్రభుత్వ గృహం కావాలని విద్యార్థులు మంత్రికి విజ్ఞప్తి చేశారు.
మంత్రి స్పందిస్తూ.. బిసి సంక్షేమ వసతి గృహాల కొరకు ఎంపీ నిధుల ద్వారా రూ.కోటి మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రస్తుతం ఉన్న వసతి గృహాల్లో మరమ్మత్తుల కొరకు నిధులు కేటాయించడం జరిగిందన్నారు. మరి ముఖ్యంగా శాశ్వత భవనాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని అక్కడి విద్యార్థినిలకు సూచించారు.
కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి జయ నాగేశ్వర రెడ్డి, కర్నూలు జిల్లా బి. సి సంక్షేమ అధికారి వెంకట లక్ష్మి, కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప. తదితరులు పాల్గొన్నారు.