Tuesday, November 26, 2024

వకీల్ సాబ్.. పాచిపోయిన సినిమా: పేర్ని నాని

ఏపీలో పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలు రద్దు చేయడంపై రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, బీజేపీ నేతలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్సందించారు.

బీజేపీ నేత సునీల్ దియోదర్ సినిమాలు చూడటానికే తిరుపతికి వచ్చినట్లు ఉందని మంత్రి పేర్ని నాని అన్నారు. వకీల్ సాబ్ సినిమా హిట్ అవుతుంది బీజేపీ గెలుస్తుందన్న సునీల్ దియోధర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. వకీల్ సాబ్ చిత్రానికి, ఎన్నికలకు ఏంటి సంబంధం అని ఆయన ప్రశ్నించారు. సునీల్ దియోధర్ పువ్వు గుర్తుకు ఓటేయమని చెప్పేందుకు వచ్చారా? లేక పువ్వులు పెట్టేందుకు వచ్చారా? అని వ్యాఖ్యానించారు. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం 4 షోలకే అనుమతి ఉందని స్పష్టం చేశారు. టికెట్ రేట్లు పెంచి జనం జేబులు కొట్టాలా? అని ప్రశ్నించారు. పవన్ సినిమా అయినంతమాత్రాన నిబంధనలు మార్చరన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికారు.

ఏపీకి ఏం చేశారని బీజేపీకి ఓటువేయాలి? అని మంత్రి ప్రశ్నించారు. ఏపీ ప్రజలను మోసం చేసినందుకే ఓటు వేయాలా? విభజన హామీలు అమలు చేయనందుకు ఓటు వేయాలా? ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు ఓటు వేయాలా? అని మండిపడ్డారు. పాచిపోయిన లడ్డులు ఇచ్చారన్న పవన్.. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పాలని డిమాండ్ చేశారు. చేయి చాచి సాయం అడిగితే ఉమ్మేశారని పవనే ఆరోపించారని గుర్తుచేశారు. పవన్ నిలకడలేని నాయకుడని బీజేపీ నేతలు 2019 ఎన్నికలకు ముందు మాట్లాడారని తెలిపారు.

‘’ప్రత్యేక హోదా ఇవ్వమని చెప్పినందుకు బీజేపీకి ఓటు వేయలా? విభజన హామీలు నెరవేర్చని బీజేపీ పాచిపోయిన లడ్డులు ఇచ్చారు. వకీల్ సాబ్ కూడా పాచిపోయిన సినిమానే’’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు, సోనియాలు కక్ష గట్టి ఇబ్బంది పెట్టినా జగన్ భయపడలేదన్నారు. చెంచాగిరి చేసే సునీల్ పిచ్చి కూతలు మానుకోవాలని హితవు పలికారు. ప్యాలెస్ లో ఉండే జగన్ ను రోడ్డుపై తెచ్చానంటున్న చంద్రబాబు.. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో పూరి గుడిసెలో ఉన్నారా ? అని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు.

సీఎం తిరుపతి పర్యటనకు వస్తుంటే బీజేపీ, టీడీపీలు భయపడుతున్నాయని తెలిపారు. వైసీపీకి ఎందుకు ఓటు వేయాలో చెప్పేందుకు ఈ నెల 14న తిరుపతికి సీఎం వస్తున్నారని చెప్పారు. బీజేపీ ఏపీకి రుణపడి ఉందని.. ఆ రుణం తీర్చుకుని ఓట్లు అడగాలని మంత్రి పేర్ని నాని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement