( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ) – అభంశుభం తెలియని చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడటం అమానవీయం, అమానుషమని అన్నారు రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారధి . సభ్యసమాజం తలదించుకునే ఘటనలో నిందితుడిని కఠినాతి కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. చిన్నారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.. ఏలూరు జిల్లా నూజివీడు రూరల్ మండలం పల్లెర్లమూడి గ్రామంలో జరిగిన లైంగిక దాడి కేసులో విజయవాడ ప్రభుత్వాసుప్రతిలో చికిత్స పొందుతున్న బాధితురాలని మంగళవారం మంత్రి పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ, ఇటువంటి దాడులను ప్రతిఒక్కరు ఖండించాలని కోరారు . ఈ ఘటన సమాచారం తెలిసిన వెంటనే దోషిని గుర్తించాలని జిల్లా యంత్రాంగాన్ని, పోలీస్ అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ,హోం మంత్రి అనిత తక్షణమే స్పందించి దోషులను గుర్తించాలని పోలీస్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారన్నారు. పోలీసులు రంగంలోకి దిగి అనుమానితుడిని గుర్తించి రెంటచింతల సమీపంలో అరెస్ట్ చేశారని మంత్రి వివరించారు