నెల్లూరు జిల్లాలో కుండపోత వర్షం పడుతోంది. జిల్లాలోని ప్రాజెక్టులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్షిస్తున్నారు. జిల్లాలో వరదల కారణంగా జరిగిన ప్రాణ, రైతుల పంట నష్టాలపై వాకబు చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని సంగం, అనంతసాగరం, చేజర్ల మండలాలపైనా రివ్యూ చేశారు. సోమశిల ఆనకట్టకు పక్కనే ఉన్న శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రాచీన కామాక్షి సమేత సోమేశ్వర ఆలయం వరద ధాటికి ధ్వంసమవడం, విగ్రహం కొంత దూరం కొట్టుకుపోయిన సమాచారం తెలుసుకుని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి సోమశిల ప్రాజెక్టు సమీపంలో ఉన్న సోమేశ్వర ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దాలని మంత్రి మేకపాటి ప్రతిపాదించారు. సోమేశ్వర ఆలయం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, వంశపారంపర్య ధర్మకర్త ఉప్పల విజయ్ కుమార్ సహా పరిసర ప్రాంతాల వైసీపీ నాయకులు గుండుబోయిన వెంకటరమణ, గుండుబోయిన ఈశ్వరయ్య, ఎద్దుల శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ప్రజలతో మంత్రి ఫోన్లో మాట్లాడారు.
నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం, వైఎస్ఆర్ కడప జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు దర్శించుకునే ఆ ఆలయాన్ని పునర్ నిర్మిస్తామని, విగ్రహాలను పునఃప్రతిష్ట చేస్తామని మంత్రి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఎంతో శ్రమకోర్చి కొట్టుకుపోయిన స్వామి విగ్రహాలను తీసుకొచ్చేందుకు కృషిచేసిన సోమశిల యువతను మంత్రి అభినందించారు. చోళుల కాలం నాటి పురాతన ఆలయం చెక్కుచెదరకుండా ముందస్తు జాగ్రత్తలతో సోమశిల డ్యామ్ నిర్మించినప్పటికీ.. ఇలా ప్రకృతి విపత్తులో గుడి గోపురం, ఎన్నో ఏళ్ళ నాటి మహా వృక్షాలు నేలకొరగడం బాధాకరమని మంత్రి మేకపాటి అన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో వర్షం ప్రభావం, వరద పరిస్థితిపై ఆర్డిఓ చైత్ర వర్షిణి, ఆరు మండలాల వైసిపి నాయకులు, ప్రజలను అడిగి తెలుసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital