Saturday, November 23, 2024

విశాఖలో దక్షిణాది రాష్ట్రాల నైపుణ్య పోటీలు

విశాఖపట్నంలో దక్షిణ భారత రాష్ట్రాల నైపుణ్య పోటీలను నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో  యువతకు పెద్దపీట వేసే ఆలోచనలతో రాష్ట్రం ముందడుగు వేస్తోందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్శిటీ కన్వెన్షన్ సెంటర్ లో జ్యోతి ప్రజ్వలన చేసి మంత్రి మేకపాటి పోటీలను ఆరంభించారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి మాట్లాడుతూ..ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి ఆలోచన, ఆచరణా యువత కోసమే..యువతలాగే ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వచ్చిన పోటీదారుల మార్చ్ ఫాస్ట్ ద్వారా తానూ స్ఫూర్తి పొందినట్లు మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఆస్ఫూర్తితో ఆయన అప్పటికప్పుడు ఇంగ్లీష్ లో కవిత వినిపించారు. “గట్టిగా ప్రయత్నిస్తే ఆకాశమేమీ హద్దు కాదు. సముద్రమేం పెద్ద లోతూ కాదు. జీవితంలో ఎన్ని  కష్టాలొచ్చినా …కన్నీళ్లే సుడిగండంగా మారినా..మంచైనా.. చెడైనా వెనుతిరిగి చూడవద్దు. ఎక్కడా ఆగిపోవద్దు. మీ ఆలోచన, మీ ఆచరణే మీ హద్దు” అంటూ మంత్రి మేకపాటి తన ప్రసంగం ద్వారా యువతలో స్ఫూర్తి నింపారు. అంకితభావంతో ఏదైనా చేయండి..విజయం మీదేనంటూ యువతలో ఉత్సాహపరిచారు. దక్షిణ భారత రాష్ట్రాల యువతీయుకులు, నైపుణ్య పోటీదారులంతా ఇప్పటికే విజేతలయ్యారని, త్వరలో నైపుణ్యం, అంకితభావం, పోరాటపటిమతో  జగజ్జేతలుగా నిలవాలన్నారు. నైపుణ్య పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన 500 మంది యువతీయువకులు భారతదేశాన్ని నడిపించే స్థాయికి చేరాలన్నారు.

ఎన్ఎస్డీసీ, ఏపీఎస్ఎస్డీసీ సంయుక్తంగా యువత సత్తా చాటే వేదికను ఏర్పాటు చేయడాన్ని మంత్రి మేకపాటి అభినందించారు. వీటి వల్ల యువతకు నైపుణ్యం, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇప్పటి వరకూ 17.87 లక్షల మంది అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ వెబ్ సైట్ లో నమోదై శిక్షణ పొందడం అందుకు నిదర్శనమన్నారు.  11సంస్థల భాగస్వామ్యంతో వివిధ నైపుణ్య వేదికలను ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాల నుంచి  నైపుణ్యమున్న యువతను వెలికితీయడాన్ని ప్రశంసించారు. 2019 వల్డ్ స్కిల్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నైపుణ్య కార్యక్రమంలో  రష్యా లోని కజాన్ లో నిర్వహించిన నైపుణ్య పోటీలలో 63 దేశాలు పాల్గొనగా అందులో  భారత్ 13వ స్థానంలో నిలిచిందన్నారు. 2022 అక్టోబర్ లో చైనాలోని షాంగైలో నిర్వహించే  ప్రపంచ స్థాయి పోటీలలో మరింత సత్తాచాటి పురస్కారాలు అందుకోవాలని మంత్రి మేకపాటి ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement