Tuesday, November 26, 2024

ప్రతి గ్రామాన్ని సమీక్షిస్తా…ప్రతి సమస్యపైనా స్పందిస్తా.. అధికారులకు మంత్రి మేకపాటి క్లాస్

నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో సమీక్ష సందర్భంగా ఆర్టీజీఎస్ సాంకేతిక ఇబ్బందిని ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పర్కరించారు. అధికారులు సాంకేతిక సమస్యను మంత్రికి వివరించడంతో అప్పటికప్పుడు సంబంధిత సీఈవోకి ఫోన్ లో సమస్యను వివరించి పరిష్కారం చూపించారు.

సంగం మండలంలో కొత్తగా 174 మందికి వైఎస్ఆర్ పింఛన్ కానుక మంజూరు అయ్యాయి. రూ.కోటి 69 లక్షలతో ప్రతి నెలా సంగం మండలంలో పింఛన్ల పంపిణీ చేస్తున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా 183 మంది దరఖాస్తులు ఆర్టీజీఎస్ లో పెండింగ్ లో ఉండగా 130 వరకూ కొత్త పింఛన్లను అప్ లోడ్ చేయించి మంజూరుకు మంత్రి మేకపాటి లైన్ క్లియర్ చేశారు.  మంత్రి సమీక్ష సమాచారం ఉన్నా గైర్హాజరైన స్థానిక ఆర్.ఐ సిరాజ్ ను రిలీవ్ చేయమని మంత్రి మేకపాటి ఆదేశాలు చేశారు.

ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించే వారు నా నియోజకవర్గంలో అవసరం లేదని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. సంగం మండలంలోని వీఆర్వో రసూల్ ని రిలీవ్ చేయాలని ఓఎస్డీ చెన్నయ్యకు ఆదేశించారు. గతంలోనూ ఇదే వైఖరితో ఫిర్యాదులు, ప్రజా సమస్యలు పట్టనట్లు వ్యవహరించడం తన దృష్టికి రావడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

RWS అధికారుల ఆధ్వర్యంలో సంగం వ్యాప్తంగా సర్వేకు మంత్రి ఆదేశించారు. ఎక్కడెక్కడ తాగునీటి సమస్యలు, నీటి రంగు మార్పు, నీటి పరీక్షలు, పైప్ లైన్ల ఏర్పాటు, మార్పులపై సంక్రాంతి అనంతరం నివేదిక రూపొందించాలని మంత్రి మేకపాటి దిశానిర్దేశం చేశారు. సీసీ రోడ్ల పనులు పూర్తిచేయకపోవడంతో నాయకులు, కాంట్రాక్టర్లపైనా మంత్రి ఫైర్ అయ్యారు. బిల్లులు ఎప్పటికప్పుడు క్లియర్ చేసి, సిమెంట్ కొరత తీర్చినా పనులు పూర్తి చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులకు కావాల్సిన ఇసుక కొరతను కూడా 24 గంటల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సచివాలయ నిర్మాణ పనులు సహా అన్నీ మార్చి 31లోగా పూర్తి చేయాలని తుది గడువు నిర్దేశించారు.

గడువులోపు పూర్తి చేసినవారికి ఏప్రిల్ లో బిల్లులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. మండల నాయకులు లాభ,నష్టాలు కాకుండా ప్రజల ఇబ్బందులు తొలగించాలన్నారు. ఖర్చు పెట్టకుండా పనులు, నష్టపోకుండా పదవులు రావని మంత్రి మేకపాటి వ్యాఖ్యానించారు. మీరు నిజంగా మీ ఊరు బాగు కోరుకుంటే, బాధ్యతగా పని చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల పట్ల అంకితభావంతో నిజాయతీగా పని చేస్తేనే పార్టీ నాయకులకు భవిష్యత్ లో పనులు, పదవులూ అని మంత్రి గౌతమ్ రెడ్డి తేల్చి చెప్పారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement