“జీ42” సంస్థ ప్రతినిధులతో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమావేశం అయ్యారు. అబుదాబిలోని “జీ42″లో మంత్రి మేకపాటి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మౌలిక వసతులకు సంబంధించిన ఫండింగ్ పై చర్చించారు. జీ42 కంపెనీ గురించి మంత్రి మేకపాటికి సంస్థ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రఫేలే బ్రెస్చి వివరించారు. ఎనర్జీ, స్మార్ట్ సిటీ, హెల్త్ కేర్, నైపుణ్యం, విద్య, డిజిటల్ గవర్నమెంట్ అండ్ ఎంటర్ ప్రైజెస్, ఐ.టీ, టెక్నాలజీ తదితర రంగాలలో పెట్టుబడులకు గల అవకాశాలపైనా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మేకపాటి జీ42 ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించారు. పరిపాలన, నైపుణ్య మానవవనరులు, మౌలిక సదుపాయాల కల్పనలో అన్ని విధాల ఏపీ ప్రభుత్వం సిద్ధమని వెల్లడించారు. ఐ.టీకి సంబంధించిన నైపుణ్యం గల యువతకు భారత్, ఏపీలో కొదవలేదని పేర్కొన్నారు.
కాగా, ఈ సమావేశంలో “జీ42” గ్రూప్ సీఓఓ మన్సూర్ అల్ మన్సోరి, చీఫ్ గ్రోత్ ఆఫీసర్ రఫెలే బ్రెస్చి, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రతీక్ భరదర్వాజ్, చీఫ్ ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్ తరిఖ్ బిన్ హెండి, హెల్త్ కేర్ సీఈవో అశిష్ కోషి, తదితరులు పాల్గొన్నారు.