Thursday, January 30, 2025

AP | పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి లోకేశ్ సమీక్ష

  • ఉపాధ్యాయ బదిలీ చట్టంపై చర్చ
  • టీచ‌ర్ల‌కు ఇక‌పై ఒకే యాప్..
  • ప్ర‌తి శ‌నివారం నో బ్యాగ్ డే

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో ప్రతి శనివారం ‘నో బ్యాగ్ డే’ అమలు చేయబోతున్నట్లు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పుస్తకాలు, బ్యాగుల బరువు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో విద్యార్థులకు యాక్టివిటీస్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నారుల అభ్యసన సామర్థ్యాలు పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు లోకేష్ సూచించారు.

అదేవిధంగా త్వరలోనే చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీ చట్టంపై సమావేశంలో చర్చించారు. దీనిపై ఉపాధ్యాయులు, సంఘాల నుంచి అభిప్రాయాలను సేకరించాలని సూచించారు. గత వైసీపీ హయాంలో పాఠశాల విద్యలో అనాలోచితంగా తీసుకొచ్చిన జీవో 117 ఉపసంహరణపై క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులు, వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు సేకరించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సూచించాలన్నారు.

ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉన్న అనేక యాప్‌ల స్థానంలో ఒకే యాప్‌ను రూపొందించే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వాస్తవ సంఖ్యను తెలుసుకునేందుకు అపార్ ఐడీ లింకేజీపై ఆరా తీశారు. ఏ విద్యార్థి డ్రాప్ అవుట్ అవకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యా శాఖలో చేపట్టబోయే సంస్కరణలపైనా అధికారులతో చర్చించారు.

ఈ భేటీలో పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, డైరెక్టర్ వి.విజయ్ రామరాజు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా, సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement