Tuesday, January 7, 2025

AP | ప్రధాని మోదీ పర్యటన… ఏర్పాట్లపై మంత్రి లోకేష్ సమీక్ష !

ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్‌లో మంత్రులు, ఉన్నతాధికారులు, కూటమి ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏపీకి ప్రధాని వస్తున్నారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాల‌న్నారు. ఈ మేర‌కు పర్యటన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.

అనంతరం సభా ప్రాంగణాన్ని పరిశీలించి కొనసాగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాగా, ప్రధాని రోడ్ షో, బహిరంగ సభ వేదిక, జనసమీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజి మైదానంలో బహిరంగ సభకు ప్రధాన వేదిక పనులు వేగంగా జరుగుతున్నాయి.

- Advertisement -

ప్ర‌ధాని పర్య‌ట‌న ఇలా !

ప్రధాని మోదీ జనవరి 8న మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నావల్ ఎయిర్‌స్టేషన్‌ ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకుంటారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ నిర్వహించే ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానానికి చేరుకుంటారు.

దత్తా ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ప్రధాని మోదీ ఓపెన్ టాప్ వాహనంపై సుమారు కిలోమీటరు మేర రోడ్ షో చేయనున్నారు. రోడ్ షోలో 60 వేల మందికి పైగా పాల్గొనే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఉంటారు.

పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన..

ఎన్డీయే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని మోదీ విశాఖపట్నంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఉత్తరాంధ్రలో చిరకాల వాంఛ అయిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం, పూడిమడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, నక్కపల్లి సమీపంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులకు వేల కోట్ల పెట్టుబడులు వస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement